ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఏపీ విభజన హామీలకు సంబంధించి కేంద్రం చేయాల్సిన సాయంపై నివేదిక అందించనున్నారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్, ఇతర కేంద్ర మంత్రులతో జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఏపీలోని కీలక ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయడంపై వారితో చర్చించనున్నారు.
మరోవైపు ఢిల్లీ టూర్ లో భాగంగా పోలవరం టెండర్ల రద్దు, విద్యుత్ పీపీఏలను రద్దుచేయడంపై జగన్ ప్రధాని మోదీకి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏపీ హక్కుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ పార్లమెంటు సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.