తెలంగాణ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఇలా వ్యవహరిస్తే రాష్ట్రాలకు పరిశ్రమలు రావని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అసలు విషయాలు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన మంగళవారం ఉదయం అమరావతిలో టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ జోన్ విషయంలో కేంద్రం చేసిన అన్యాయం పై చర్చ జరగక్కుండానే డేటా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల పై చర్చ జరగకుండా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమి భయంతో జగన్, కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం, వైసీపీ చేస్తోన్న తప్పుడు పనులపై చర్చ జరగక్కుండానే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ డేటానే టీఆర్ఎస్ దొంగిలించే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. లబ్ధిదారుల జాబితా అనేది పబ్లిక్ డొమైన్ అని, ప్రతీ ఊర్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను వెల్లడిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రలను ఛేదించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.