telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మళ్ళీ జబర్దస్త్ వైపు చూస్తున్న.. నాగబాబు..

Nagababu

కామెడీ షో జబర్దస్త్ గత కొన్నేళ్లుగా ప్రతీ ఇంటినీ నవ్వులమయం చేసేస్తోంది. అందుకే ఈ షోకి ఎక్కడాలేని పాపులారిటీ వచ్చింది. ఈ వేదికపై రోజా, నాగబాబు చేసిన హంగామా అంతాఇంతా కాదు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ ఇద్దరూ బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిచ్చారు. అయితే ఇటీవలే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షోకి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేసిన కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జబర్దస్త్ వేదికపై నాగబాబు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన వెళ్లిపోయిన తర్వాత షో కళ తప్పింది. ఆయన వెళ్లి ఇన్నిరోజులైనా రోజా పక్కన సరిగ్గా సూట్ అయ్యే మరో సెలబ్రిటీ ఇంతవరకూ దొరకలేదు. చాలా మందితో ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఆ లోటు అలాగే ఉంటోంది. ఆయన లేని చోటు.. ఆ నవ్వులు జబర్దస్త్ అభిమానులు మిస్ అవుతున్నారు.

నరేష్, పోసాని, తరుణ్ భాస్కర్ లాంటి జడ్జ్ లను తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు. టీఆర్ఫీ పరంగా ఓకే అనిపిస్తున్నా మరో జడ్జ్ స్థానంలో నాగబాబు లేకపోవడం వెలితిగా కనిపిస్తోంది. నాగబాబు ఈ షోను వదిలేసి మూడు నెలలు దాటినా ఆ ప్లేస్‌లో మరొకరిని ఉహించుకోలేకపోతున్నారు జనం. నాగబాబు మాత్రం ‘అదిరింది’ షోకు ఫిక్స్ అయిపోయాడు. జబర్దస్త్ పోటీగా దిగిన ఆ షో మాత్రం అనుకున్న మేర రేటింగ్స్ రాబట్టడం లేదు. వేణుతో పాటు ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి టీమ్స్ వచ్చినా ఆ షో పెద్దగా ఆకర్షణీయం కాలేదు. దీంతో ఇప్పుడు అక్కడ్నుంచి బయటపడాలని నాగబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మళ్లీ సొంత గూటికి నాగబాబు చేరతాడనే టాక్ ముదిరింది. ఇదే సమయంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. 3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగబాబు గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు గెటప్ శ్రీను.

నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడం అనేది పూర్తిగా ఆయన పర్సనల్ అని చెప్పిన గెటప్ శ్రీను.. ఆయన లేని లోటు కనిపిస్తుందని చెప్పాడు. అంతేకాదు అదిరింది చేసినా.. ఇంకో షో చేసినా అంతా ఓ కుటుంబంలా కలిసుంటామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగబాబు జబర్దస్త్ షోలోకి మళ్లీ రావచ్చనే అనుమానాలు రేకెత్తిస్తూ మాట్లాడాడు గెటప్ శ్రీను. తిరిగి ఆయన జబర్దస్త్ లోకి వస్తే బాగుంటుందని, రావాలనే తామంతా కోరుకుంటున్నామని అన్నాడు.

Related posts