ఈశాన్య రాష్ట్రాలు పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అట్టుడుకుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గువాహటిలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గురువారం సాయంత్రం రోడ్లపైకి చేరుకున్న నిరసనకారులపై భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఘర్షణల్లో గాయపడ్డ మరికొందరికి గువాహటి మెడికల్ కాలేజ్‌లో చికిత్స అందిస్తున్నారు. అస్సాం వ్యాప్తంగా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నివాసాలపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి అస్సాంలోని 10 జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గువాహటిలో కర్ఫ్యూ విధించారు.
ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆందోళనలను అదుపు చేయడానికి ఈశాన్య రాష్ట్రాలలో ఆర్మీని మోహరించారు. మేఘాలయాలో కూడా 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు హోంశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జాన్ ఖాన్ తన షిల్లాంగ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకుముందు బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ కూడా ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడంపై మోమెన్ విమర్శలు గుప్పించారు.