తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. గత నాలుగు నెలల వైకాపా పాలనలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని లేఖలో ఆరోపించారు. అందుకు అనుభవరాహిత్యం, ఆశ్రిత పక్షపాతం, కక్ష సాధింపు వైఖరే కారణమన్నారు. గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరగడం వైకాపా పాలన దుస్థితికి తాజా నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటన ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చ తెచ్చిందన్నారు. దాదాపు 19లక్షల అభ్యర్థులు, కుటుంబ సభ్యులకు వేదన మిగిల్చిందన్నారు. వైకాపాకు చెందిన వారి బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు వచ్చాయని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకైందనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలన్నారు.
ప్రశ్న పత్రాలు ఏపీపీఎస్సీ కంటే ముందే విశ్రాంత అధికారి, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఎలా చేరాయని నిలదీశారు. పొరుగు సేవల సిబ్బందికి, వారి బంధువులకే టాప్ ర్యాంకులు రావడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనలో ఏపీపీఎస్సీ, పంచాయతీరాజ్, విద్యాశాఖ బాధ్యత ఎంతని చంద్రబాబు ప్రశ్నించారు. నష్టపోయిన అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. జరిగిన అవినీతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని, పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కేలా చూడాలని లేఖలో కోరారు. ఈ అవినీతికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.