ఏపీలో టీడీపీ నేతలు కమలం పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాషాయ కండువాలు కప్పుకున్నారు. తాజగా రాయపాటి, తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ, మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. శ్రావణ మాసంలో మరి కొంత మంది నేతలు బీజేపీలో చేరుతారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలోకి వలసల పై టీడీపీ ఎంపీలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఈ విషయం పై స్పందించిన చంద్రబాబు మన పార్టీ నుంచి వెళ్ళిపోయే వారిని పోనివ్వండి అని తెలిపారు. వారు పొతే కొత్త నాయకత్వం వస్తుందన్నారు. కొత్తవారితో పార్టీని బలోపేతం చేద్దాం అని చంద్రబాబు అన్నారు. అంతే కాదు, ఇలాంటి నేతలు ఎంత మంది వెళ్లి బీజేపీలో చేరిన వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోనూ బీజేపీ ఎన్ని విన్యాసాలు చేసినా వారు ఎదిగే అవకాసం లేదని అన్నారు. వెళ్ళిపోయే వారిని పోనివ్వండి.. మనం మన పని చేసుకుంటూ వెళ్దామని అన్నారు. ప్రజా సమస్యల పై ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉందాం.. ప్రజలకు దగ్గరగా పని చేద్దాం అని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు చెప్పిన అభిప్రాయాన్నే టీడీపీ అభిమానులు కూడా చెప్తున్నారు. ఇలాంటి నేతలు పోయినా, ఒక్క కార్యకర్త కూడా అటు వైపు చూడరని, ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వెయ్యరని అంటున్నారు.