telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి-పీఆర్సీపై పేర్ని నాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీపై ఉద్యోగ , ఉపాధాయ సంఘాలు మండిప‌డుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు దిగాయి. జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడితో దద్దరిల్లాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

తాజాగా ఉద్యోగుల ఆందోళనపై రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్నినాని తీవ్రంగా స్పందించారు. ఉద్యో గుల ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న విధానమే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోని, ఆలోచించాల‌ని పేర్ని నాని కోరారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని పేర్ని నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నెలలోపే ఐఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు. ఉద్యోగుల పట్ల సీఎంకు ప్రేమ, సానుభూతి లేకపోతే 30 రోజుల్లోనే మధ్యంతర భృతి ప్రకటించలేదా..? అని ప్రశ్నించారు.

కన్నబిడ్డలు అడిగినంత ఇవ్వలేకపోతే తల్లి ఎంత బాధపడుతుందో జగన్ అంతే బాధపడుతున్నారని మంత్రి తెలిపారు.  23 శాతం ఫిట్‌మెంట్‌ను కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇస్తున్నామని పేర్ని నాని చెప్పారు. ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయాలు కావా అని మంత్రి ప్రశ్నించారు. ఉద్యోగులు తమ మొత్తం జీతం పెరిగిందా.. లేదా అనేది చూడాలని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు ఆశించనమేరకు పీఆర్సీ ఇవ్వలేకపోవడం బాధాకరమే అని అన్నారు.

ఐఆర్‌ కింద రూ.17, 918 కోట్లు ఇచ్చామని చెప్పారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోతపడుతుందనేది అవాస్తవమని మంత్రి తెలిపారు.ఉద్యోగులను యూనియన్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts