ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారిని వేధింపులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం మండిపడ్డారు. జగన్ కీ తుపాను కంటే పెద్ద సమస్య అని చెప్పారు. తుపాను కొన్ని ప్రాంతాలపైనే ప్రభావం చూపుతుంది. జగన్ ప్రతి అభివృద్ధి పనికి అడ్డంపడుతున్నారని దుయ్యబట్టారు.
అర్హులకు పింఛన్లు, నిరుద్యోగభృతి ఇస్తున్నామన్నారు. 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ వర్తిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఇంకా అనేక వర్గాలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చామని పేర్కొన్నారు. 98 లక్షల మందికి పసుపు-కుంకుమ ఇచ్చామని గుర్తుచేశారు. మహిళలంతా ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.