telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాంధీజీ నుంచి కోవింద్ దాకా వాడిన మొట్ట మొదటి స్వదేశీ పెన్ను ‘రత్నం పెన్ను’

Rathnam-Pen

రాజమండ్రి రత్నం పెన్నులు..రాష్ట్రపతులు, ప్రధానులూ ఈ పెన్నే ఉపయోగిస్తారు. మహాత్మా గాంధీ తన పర్యటనల్లో భాగంగా ఓసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వస్తున్న సమయంలో రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో ఆగారు. ఆ సమయంలో రాజమండ్రిలోని రత్నంపెన్నుల సంస్థ యజమాని కేవీ రత్నం.. స్వదేశీ తయారీ, విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా తాను తయారు చేసిన పెన్నును గాంధీని కలిసి బహూకరించారు.

స్వదేశీ వస్తువు ఏదైనా చేయమని 1921లో మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి అని గాంధీజీతో రత్నం అన్నారు. కానీ గాంధీజీ ఆ పెన్నును చూసి విదేశీ దిగుమతి కావచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన సహాయకుడు కుమారప్ప స్వయంగా పరిశీలించి, పూర్తి స్వదేశీ తయారీ అని నిర్థరించిన తర్వాత గాంధీ దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత “మీరు పంపిన పెన్ను వాడుతున్నాను, ఆనందంగా ఉంది” అంటూ 1935లో కేవీ రత్నానికి గాంధీ స్వయంగా లేఖ రాయడం విశేషంగా మారింది.

1932లోనే పెన్నుల తయారీని ప్రారంభించినా, గాంధీజీ లేఖ రాసిన నాటి నుంచి రత్నం పెన్ను అంటే స్వదేశీ పెన్నుగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇప్పటికీ గాంధీజీ రాసిన లేఖను అక్కడ చూడవచ్చు. “మీరు పంపిన పెన్ను వాడుతున్నాను, ఆనందంగా ఉంది” అంటూ గాంధీజీ స్వదస్తూరీతో రాసిన లేఖ

పెన్నుల తయారీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రబ్బరు వాడుతుంటారు. కానీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వెండి, బంగారం పెన్నులు కూడా తయారు చేస్తున్నారు. 14 క్యారెట్, 24 క్యారెట్ బంగారం పెన్నులు కూడా సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో గాంధీకి అందించిన పెన్ను కూడా 14 క్యారెట్ల బంగారం పాళీతో చేసిందే.

పాళీ తయారీలో 24 క్యారెట్ బంగారం కన్నా 14 క్యారెట్ల బంగారమే సౌకర్యవంతంగా ఉంటుందని, అందుకే ఎక్కువ మంది 14 క్యారెట్ల బంగారంతో తయారయిన వాటికే ప్రాధాన్యమిస్తారు. వీరు తయారు చేసిన 1.5 గ్రాముల బరువుండే అతి చిన్న పెన్, అతి చిన్న బంగారం పెన్నులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

రత్నం పెన్నుల్లో ఎన్నో రకాలున్నాయి. ఖరీదు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. 300 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల ఖరీదు చేసే పెన్నులను వీరు తయారు చేస్తున్నారు. అందులో ‘సుప్రీం’ అనే మోడల్ కేవలం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి వారి కోసం తయారుచేస్తున్నారు.

రత్నం పెన్నులతో రాయడం అలవాటైతే వేరే పెన్నులు వాడాలని అనిపించదంటారు. రత్నం పెన్స్ కోసం దూరదూరాల నుంచి వస్తుంటారు. రాజమహేంద్రవరంలో ఓ చిన్న సందులో ఉండే ఈ షాపుని వెదుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో ఎందరో రావడాన్ని చూస్తేనే ఆ పెన్నుల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు.

తరాలు మారినా పెన్నుల ప్రత్యేకత కొనసాగుతూనే ఉంది. రత్నం సోదరులు, వారి కుమారులు కూడా ఇదే వృత్తిగా మలచుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల నుంచి నేటి తరం నేతల వరకూ పలువురు ఈ పెన్నుల పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.

భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వరకూ ప్రమాణస్వీకార పత్రాలపై తమ పెన్నులతోనే సంతకాలు చేసినట్టు , అలాగే నెహ్రూ నుంచి మోదీ వరకూ ప్రధాన మంత్రులందరూ రత్నం పెన్నులను వాడినట్టు , ఈ మోడల్ కేవలం వారికోసమే సిద్ధం చేస్తామని, జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా రాజమండ్రిలోని కేవీ రత్నం పెన్స్ తయారీకేంద్రాన్ని సందర్శించారని , అప్పట్లో నెహ్రూ వాడిన రత్నం పెన్ నేటికీ అలహాబాద్లోని ఆయన స్వగృహంలో దాచి ఉంచినట్టు, అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులకు సైతం రత్నం పెన్నులు అందించామని, రత్నం పెన్స్ తయారీలో తండ్రితో పాటు భాగస్వామిగా ఉన్న గోపాల రత్నం , కేవీ రత్నం సోదరుడు రమణమూర్తి చెబుతున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు లో ఒకసారి 25 లక్షల ప్రశ్న కింద “మన దేశంలో మొట్ట మొదటి స్వదేశీ పెన్ను ఎక్కడ తయారయ్యింది” అనే ప్రశ్నకు జవాబు రాజమండ్రి అని చెప్పలేక ఒకతను క్విజ్ లో ఓడిపోవడం కొస మెరుపు.

Related posts