telugu navyamedia
ట్రెండింగ్

మానవత్వాన్ని చాటిన బస్సు డ్రైవర్.. వీడియో వైరల్

bus driver saved a baby from icy cold

మనిషికి పుట్టుక-చావులు ఉన్నాయేమోగాని, మానవత్వానికి అవి లేవు, అందుకే అది చిరంజీవి. మనం ఉన్నా లేకున్నా, మనం చేసిన మంచి రేపటికి ఉంటూనే ఉంటుంది. అదే రేపటి తరాలకు దారి చూపుతుంది. అదే నిజమైన జీవన విధానం. అన్ని మతాలు బోధిస్తున్నది కూడా అదే. దానికి ఉదాహరణగా ఈ సందర్భం చెప్పుకోవచ్చేమో చూడండి.. ఈ ఘటన అమెరికాలోని మిల్వాకీలో జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ఓ మహిళా డ్రైవర్ బస్సు నడుపుతోంది. ఇంతలో ఓ ఘటన ఆమె కళ్ల పడింది. వణికించే చలిలో అంత పెద్ద రహదారిలో ఉత్తి కాళ్లతో నడుస్తున్న ఓ పసిపాప ఆ డ్రైవర్ కంట పడింది. వెంటనే బస్సు ఆపి ఆ బిడ్డని రక్షించి బస్సెక్కించింది. ఈ ఘటన మిల్వాకీ కౌంటీ ట్రాన్సిట్ సిస్టమ్ సీసీటీవీలో రికార్డయింది. ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇరినా ఇవిచ్, ఈమె ఒక బస్సు డ్రైవర్. మిల్వాకీలో ఓ రహదారిపై వేగంగా బస్సును నడుపుతోంది. ఇంతలో వాహనాలు వేగంగా పోయే ఆ రహదారిపై గడ్డ కట్టించే చలిలో కాళ్లకు ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్న ఓ బిడ్డ కనపడింది. ఇరినా బస్సు ఆపేంతలోనే ఆ పాప ఓ మలుపుకు చేరుకుంది. వెంటనే బస్సుని ఆపిన ఇవిచ్ రోడ్డుకి అడ్డంగా పరుగులు పెట్టి ఆ బిడ్డని ఎత్తుకుని బస్సులోకి వచ్చింది. ఎందుకు బస్సు ఆగిందని గాభరాపడిన ప్రయాణికులు పాపను తేవడంతో చూసి అవాక్కయ్యారు. వెంటనే ఓ ప్రయాణికురాలు తన కోటు తీసి మంచుగడ్డలా చల్లగా ఉన్న ఆ పాపపై కప్పింది. ఇరినా ఆ 19 నెలల పాపను జోకొట్టి నిద్రపుచ్చి తిరిగి బస్సు నడిపింది.

తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆ పాప అలా రోడ్డుపైకొచ్చినట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. ఆ బిడ్డను తండ్రికి అప్పజెప్పారు. ఇరినా ఇవిచ్ పనిచేసే మిల్వాకీ కౌంటీ ట్రాన్సిట్ సిస్టమ్ సంస్థ ఆమె చేసిన పనిని ప్రశంసించి అభినందనలు తెలియజేసింది.

Related posts