telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గుళ్ళో.. అసలు గోపురం ఎందుకు ఉంటుందో తెలుసా..

గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురం. అసలు గోపురం విశిష్టత ఏమిటి ?

ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు. గర్భగుడి భగవంతుని శిరసు, ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు.

దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి, స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం.

కాని ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు (వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న అమ్మపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది.

 

పూర్వాకాలంలో ఈరోజు ఉన్నట్టుగా హోటల్ సౌకర్యాలు లేవు.ఇతర దేశాలు, రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు.

అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది. వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి. అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు. వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా.

 

దేవుడు సర్వోన్నతుడు(అందరికంటే ఉన్నతమైన వాడు/గొప్పవాడు).ఈ విషయాన్ని మరిచిపోయిన మనిషి తానే గొప్పవాడినని,అంతా తనవల్లే జరుగుతోందని, తాన కంటే గొప్పవారేవరూ లేరని అహంకారంతో విర్రవీగుతాడు.అది భ్రమ మాత్రమే,అందరికంటే భగవంతుడే సర్వోన్నతుడు అన్న భావం అందరిలో కలగడానికి,మనసుకి భోధపడటానికి దేవాలయ గోపురాన్ని ఎత్తుగా నిర్మిస్తారు.

 

గోపురం అంటే పిరమిడ్ ఆకారం .పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు.

 

అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్యశక్తులను నిత్య అందిస్తూ ఉంటుంది. కనీసంలో కనీసం 500 సంవత్సారాల పాటు ఒక గోపురం అనేక దివ్యశక్తులను దేవాలయానికి అందిస్తుంది.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.

 

ఒక గోపురం ఎత్తు ఆ ఆలయమూలవిరాట్టు(ఆలయ ప్రధాన దైవ విగ్రహం) ఎత్తుని బట్టి నిర్ణయిస్తారు.గాలి గోపురాలు ఉన్న ఆలయాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి.

 

ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడిన సమయంలో అక్కడున్న నిర్మాణాలకు,ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూండా,పిడుగు పాటును గ్రహించి,ఆ విద్యుత్ శక్తిని భూమిలోనికి పంపించేస్తాయి గోపురాలు.అంతేకాదు అవి గ్రహించిన దివ్యశక్తులను ఆలయంలో ఉన్న మూలమూర్తికి నిత్యం అందిస్తుంటాయి గోపురాలు.

 

చారిత్రికంగా చెప్పుకోవలసి వస్తే అలనాటి శిల్పకళ చాతుర్యానికి,వైభవానికి ప్రతీకలు మన ఆలయ గోపురాలు.కాని ఈ రోజు అనేక గోపురాలు కూలిపోతున్నాయి,శిధిలమవుతున్నాయి,పాడుతున్నాయి,పిచ్చిమొక్కలు మొలిచి వాటికి అందాన్ని కోల్పోతున్నాయి.ఏన్నో వందల సంవత్సరాల మన చారిత్రిక వారసత్వ సంపద గోపురాలు.

 

మనం ఈ రోజు ఏదినా ఒక నిర్మాణం చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏన్నో సంవత్సరాల క్రితం, సిమెంట్ లేనికాలంలో రాయిమీద రాయిని పెట్టి,కొన్ని వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా నిర్మాణం చేశారు మన పూర్వీకులు. మనమేలాగో అంత గొప్ప నిర్మాణాలు చేయలేము.కనీసం ఉన్నవాటినైన కాపాడుకుందాం.

ఎక్కడైన గోపురం కూలిందంటే అక్కడ కూలింది గోపురం మాత్రమే కాదు. మన వారసత్వ సంపద,మన పూర్వీకుల శ్రమ.

  

 

 

Related posts