బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతి లో సెంటు భూమి కూడా లేదు దమ్ముంటే చూపించాలంటూ తనకు సుజనా విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సుజనా చౌదరి బంధువులకు సంబంధించి భూముల చిట్టాను బొత్స విడుదల చేశారు. సుజనాచౌదరికి చెందిన గ్రీన్ టెక్ కంపెనీ డైరెక్టర్ జితిన్ కుమార్ కు రాజధానిలో 120 ఎకరాల భూమి ఉందని మీడియాతో చెప్పారు. సుజనాచౌదరికి చెందిన 120 కంపెనీల్లో గ్రీన్ టెక్ కంపెనీ ఒకటి అంటూ స్పష్టం చేశారు.
కళింగ గ్రీన్ టెక్ కంపెనీ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. దీనిపై సుజనాచౌదరి ఏం చెప్పారని నిలదీశారు. మరోవైపు సుజనాచౌదరి తమ్ముడు కుమార్తె యలమంచిలి రుషికన్యకు కూడా 14 ఎకరాల భూమి రాజధాని ప్రాంతంలోనే ఉందన్నారు. వీర్లపాడు మండలం గోకరాజుపాలెంటలో 14 ఎకరాలు ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ భూములు కేవలం నామ మాత్రమేనని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని బొత్స స్పష్టం చేశారు.