telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంగ్ల మాధ్యమంపై పురందేశ్వరి విమర్శలు

daggubatipurandeswari

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరి చేయడంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. ఇంగ్లిష్ ప్రపంచ వ్యాప్త భాష అని ప్రజలందరూ ఒప్పుకుంటారని పురందేశ్వరి అన్నారు. అయితే, మన మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే, మన చరిత్రతో ముడిపడి ఉన్న మన మూలాలు తెగిపోతాయని అన్నారు. దీనివల్ల మన సంస్కృతిని మనం కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టంగా చెప్పవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమని సూచించారు. ప్రజల సమస్యలపై గళం ఎత్తుతోన్న నేతలే లక్ష్యంగా ఎదురుదాడి చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విమర్శలు గుప్పించడం సరికాదనిఅన్నారు.

మన సాహిత్యంలోనే మన సంస్కృతి చాలా లోతుగా ఉందని, ప్రాంతీయ భాషలోనే ఈ సాహిత్యం అధికంగా ఉంటుందని పురందేశ్వరి చెప్పారు. మన భాషను మనుగడలో ఉంచుకోవడంతో మనం విఫలమైతే, మన భవిష్యత్ తరాలు ఈ గొప్ప సాహిత్యాన్ని అందుకోలేకపోతాయని అన్నారు.మాతృభాష ప్రాధాన్యత ఎనలేనిదని, చిన్నారులు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారని పురందేశ్వరి చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషలో బోధన అందించే ముందు ఉపాధ్యాయులకు ఆ భాషలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

Related posts