అమెరికాలోని ఓ ఆఫ్రికన్ బిలియనీర్ గొప్ప మనసును చాటుకున్నాడు. అట్లాంట ప్రాంతంలోని మోర్‌హౌస్ కాలేజీ విద్యార్థులకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న రాబర్ట్ స్మిత్ అనే బిలియనీర్.. కాలేజీలో చదువుతున్న 400 మంది విద్యార్థుల రుణాన్ని తాను తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. స్మిత్ మాటలు విన్న విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం ఒక్కసారిగా షాకైంది. మొత్తం విద్యార్థుల రుణాన్ని తీర్చడానికి దాదాపు 40 లక్షల డాలర్లు (రూ.278 కోట్లు) ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని తీర్చేందుకు తన కుటుంబం ఓ గ్రాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ మాటలు విన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, మోర్‌హౌస్ కాలేజీలో మొదటినుంచీ నల్లజాతీయులే చదువుకుంటూ వస్తున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ సైతం ఈ కాలేజీలోనే చదవడం విశేషం. ఈ గ్రాంట్ కారణంగా ఇతర ఆఫ్రికన్ అమెరికన్ల జీవితాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. కార్నెల్, కొలంబియా యూనివర్శిటీలలో విద్యనభ్యసించిన రాబర్ట్ స్మిత్ 2000 సంవత్సరంలో విస్టా ఈక్విటీ పార్టనర్స్ అనే సంస్థను ప్రారంభించారు. 2015లో ఆయన 4.4 బిలియన్ డాలర్ల(రూ. 30 వేల కోట్లకు పైగానే) నెట్ వోర్త్‌తో ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు.