telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టీ20 ప్రపంచకప్‌ కోసం906 కోట్ల భారం బీసీసీఐ పై పడుతుందా..?

ఈ ఏడాది అక్టోబరులో ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తున్న బీసీసీఐ .. ఏకంగా రూ. 906 కోట్ల భారాన్ని మోయక తప్పేలా లేదు. నిబంధనల ప్రకారం.. ఐసీసీ ప్రపంచస్థాయి టోర్నీలకు నిర్వహణ దేశాలు పూర్తిస్థాయి పన్ను మినహాయింపు ఇవ్వాలి. ఈ లెక్కన.. 2021 టీ20 ప్రపంచకప్‌నకు దాదాపు రూ. 906 కోట్లు పన్ను మినహాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి బీసీసీఐ చేసుకున్న దరఖాస్తు ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. మరోవైపు పన్ను మినహాయింపునకు ఐసీసీ విధించిన రెండు డెడ్‌లైన్లు ఇప్పటికే పూర్తవడంతో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే మరోసారి ఆ గడువును వచ్చే నెలాఖరు వరకు ఐసీసీ పొడిగించింది. ఈలోపు పన్ను మినహాయింపు విషయాన్ని బీసీసీఐ తేల్చాలి. లేదంటే ఆతిథ్య హక్కులను వదులుకోవాలి. లేకుంటే ఆ మొత్తాన్ని బోర్డు భరించాల్సి ఉంటుంది.

2016 టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో జరిగినప్పుడు నరంద్ర మోదీ ప్రభుత్వం 10 శాతం పన్ను మినహాయింపే ఇచ్చింది. దీంతో రాబోయే టీ20 వరల్డ్‌కప్‌నకు కూడా కేంద్రం ఆ మేరకు స్వల్ప పన్ను మినహాయింపు ఇచ్చినా.. బీసీసీఐ కనీసం 227 కోట్లు తన ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. బీసీసీఐ జాతీయ క్రీడా సమాఖ్య కానందున కేంద్రం పూర్తి పన్ను మినహాయించడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది డిసెంబర్ 24న జరిగిన వార్షిక సర్వ స్వభ్య సమావేశంలో ఈ పన్ను మినహాయింపుపై బీసీసీఐ ఏకాభిప్రాయానికి రాలేదు. ఒక వేళ ప్రభుత్వం పన్ను మినహాయించకుంటే ఆ మొత్తాన్ని బోర్డు భరించాలనే వాదనపై బోర్డు సభ్యులు రెండుగా చీలిపోయారు. కొందరు భరించాల్సిన అవసరం లేదంటే.. మరికొందరు ఇది ఇజ్జత్‌కే సవాలని, ఆతిథ్య హక్కులు కోల్పోతే పరువు పోతుందని గట్టిగా వాదించారు. మరీ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తుందా? లేక ఆ భారాన్ని బీసీసీఐనే భరిస్తుందా? అనేది తేలాలంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆగాల్సిందే.

Related posts