telugu navyamedia
రాజకీయ

కాబూల్‌ రక్తసిక్తం… 72 మంది దుర్మరణం

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఈ దాడులు జరిగాయి. రెండు బాంబుపేలుళ్లలో 72 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే రష్యా విదేశాంగ శాఖ మాత్రం 13 మందే మరణించారని తొలుత తెలిపింది.

ఇది ఇస్లామిక్‌ స్టేట్‌ – ఖోరాసన్‌ (ఐసిస్‌–కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్‌ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని… సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్‌ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్‌ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడితో పాటు విమానాశ్రయానికి వచ్చిన వారిపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని… బిక్కుబిక్కుమంటూ విమానాశ్రయంలోకి ప్రవేశం కోసం వేచిచూస్తున్న అఫ్గాన్లు, విదేశీయులు ఈ దాడితో తీవ్రంగా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు.

సాధారణ పౌరులతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 11 మంది అమెరికా మెరైన్‌ దళ సభ్యులు, వైద్య బృందంలో ఒకరు కలిపి మొత్తం 12 మంది అమెరికా సిబ్బంది చనిపోయారని అమెరికా ధ్రువీకరించింది. రెండోదాడి అబే గేటుకు సమీపంలోకి బారన్‌ హోటల్‌ గేటు వద్ద రాత్రి 8 గంటలకు జరిగింది. ఇక్కడ 52 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాబూల్‌ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 60 మంది క్షతగాత్రులు చేరారు. పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ అమెరికన్‌ భద్రతా సిబ్బంది మరణించినట్లు, గాయపడ్డట్లు ధ్రువీకరించారు. మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టుగా నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి.

ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఈ బాంబుపేలుళ్లు అమెరికా నియంత్రిత ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. తాము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని… ఎయిర్‌పోర్ట్‌ భద్రతపై నిశితంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌ను స్థావరంగా వాడుకోవడానికి అనుమతించబోం’ అని జబీహుల్లా ప్రకటించారు. ఐసిస్‌ ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని తామే అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు.

Related posts