రైతు బంధు అనగానే సంతోషం వ్యక్తం చేసిన వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. దీనికి కారణం.. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరాకు పదివేలు ఇస్తోందని సంబరపడుతున్నారా..? అయితే ప్రభుత్వం ఈ పథకానికి పెట్టిన మెలిక కూడా తెలుసుకోండి. ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న వారు ఇతర పథకాలను అందుకోలేరు. ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. అంతేకాదు దీన్ని ఆధారంగా చేసుకుని ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలకు బ్రేకులు వేయాలనుకుంటుంది. పదెకరాల పొలం ఉండి, పెట్టుబడి సాయం తీసుకుంటున్న రైతులకు ఈ నెల నుంచి రేషన్ సరుకులు బంద్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సరుకులు రద్దు కావడం అంటే కార్డులు రద్దు చేయడం. కార్డులు రద్దు చేయడం అంటే… అనేక ప్రభుత్వ పథకాలకు అనర్హులు కావడమే. కాబట్టి ఈ రేషన్ కార్డు రద్దు పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. చాలా మంది తమ ఆదాయం తక్కువగా చూపుతూ రేషన్ కార్డు తీసుకున్నారు, రేషన్ పొందుతున్నారు. వీరిలో పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికంగా ఆదాయం ఉన్న వారిని పౌర సరఫరాల శాఖ ఏరిపారేస్తోంది.
దీనికి రైతు బంధును ఆధారంగా చేసుకోవడం విశేషం. ఇది ఒకరకంగా బోగస్ వివరాలను పొందుపరిచి అక్రమంగా ప్రభుత్వ పథకాలకు గండికొడుతున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్టుగా పౌర సరఫరాల శాఖ అదికారులు వివరణ ఇస్తున్నారు.