గత కొంతకాలంగా గుండె, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో నిన్న చేరారు. ఆయనను ఐసీయూలోని వెంటిలేటర్ పై ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల సేపు ఆయన ఆసుపత్రిలోనే గడిపారు.
వివిధ విభాగాలకు సంబంధించిన ఓ వైద్యుల బృందం అరుణ్ జైట్లీకి చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మరోవైపు, నిన్ననే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆసుపత్రిని సందర్శించారు. అనారోగ్య కారణాల వల్ల గత ఎన్నికల్లో అరుణ్ జైట్లీ పోటీ చేయలేదు.