telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోల‌వ‌రం పై వివాదాలు సృష్టించ‌వ‌ద్దు.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? : మంత్రి పువ్వాడకు అంబటి కౌంటర్

పోలవరం వ్యవహారం పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవ‌రం ప్రాజెక్టుతో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌ని తెలంగాణ నేత‌లు అంటుంటే ..దాన్ని ఏపీ మంత్రులు ఖండిస్తున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఎత్తుపై కొత్త వివాదాలు సృష్టించొద్దని రాంబాబు అన్నారు. బాధ్యతగల పదవిలో వున్నవాళ్లు ఇలా మాట్లాడటం సరికాదని అంబటి రాంబాబు హితవు పలికారు.

పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం కెరెక్ట్‌ కాదని అన్నారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్న అంబటి…పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు.

సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని.. వరదల సమయంలో రాజకీయాలు తగవని,,వివాదాలు వుంటే అందుకు తగిన వేదికలు వున్నాయని రాంబాబు హితవు పలికారు

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 5 గ్రామాలు ఇచ్చేయాలని అంటున్నారని.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎప్పుడో ముగిసిన అంశాలపై ఇప్పుడు వివాదం సరికాదన్నారు.

ఏదైనా సమస్య ఉంటే కేంద్రంతో మాట్లాడాలని గానీ, ఇలా వివాదం చేయకూడదని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అవసరం లేదని, అందరం కలిసి మెలసి ఉండాల్సిన వాళ్లమని తెలిపారు.

వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకున్నామన్నారు. వరద బాధితులను ఆదుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని మంత్రి స్పష్టం చేశారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాంబాబు అన్నారు. మాది చంద్రబాబులా పిచ్చిమాటలు చెప్పే ప్రభుత్వం కాదని.. ఈనాడు తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోమని అంబటి తెలిపారు.

కొన్ని పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని.. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంత్రి రాంబాబు స్పష్టం చేశారు.

Related posts