telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తెలుగు చిత్ర సీమలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావుది చేరిగిపోని అధ్యాయమని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రాసెసర్ మారెడ్డి అంజిరెడ్డి అన్నారు.

ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ రచించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన చాంబర్ల ఆవిష్కరించి మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు అనేక పాత్రలకి జీవం పోసి ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారని అన్నారు. ఆయన నటించిన విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, దేవదాసు, మహాకవి కాళిదాసు, జయభేరి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం తదితర చిత్రాలలో ఆయన నటన అజరామరమని కొనియాడారు.

ఆంధ్ర కేసరి యూనివర్సిటీ డీన్ డాక్టర్ డి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమలో ఏఎన్ఆర్ వేగుచుక్క లాంటివాడని అన్నారు. తెలుగు చిత్ర సీమను తమిళనాడు నుంచి హైదరాబాద్ కు తరలించి ఎందరో సినీ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ నటుడుగా ఆయన చరిత్రను సృష్టించడమే కాకుండా, అక్కినేని ఆలోచనలు (అఆ) పేరుతో సాహితీ లోకానికి ఆయన అనుభవాలను అందించి చిరస్మరణీయుడయ్యాడని అన్నారు. పుస్తక రచయిత షేక్ మహబూబ్ జాన్ మాట్లాడుతూ అక్కినేని శతజయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర రాసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ప్రముఖ రచయిత సయ్యద్ సాబీర్ హుస్సేన్, అక్కినేని అభిమాని సలార్, ముస్లిం రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి హుమయూన్ బాషా, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి జ్ఞానేశ్వర్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు.

Related posts