కరోనా నుంచి కోలుకున్న ఆప్ ఎమ్మెల్యే అతిషి ప్లాస్మా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో తొలిసారి ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసింది. అతిషి ఇక్కడే తన ప్లాస్మాను దానం చేశారు.
ప్లాస్మాను డొనేట్ చేసిన విషయాన్ని అతిషి ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనలానే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసిన అతిషిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.
సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వైరస్‌తో సమర్థవంతంగా పోరాడతాయి. ఒక్కొక్కరు 250 నుంచి 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయొచ్చు. వీటిని కరోనా రోగుల శరీరంలోకి పంపిస్తే వారు కోలుకునేందుకు దోహదపడుతాయి.