(ఈరోజు చందాల కేశవదాసు జయంతి – 20 జూన్ 1876 – 14 మే 1956)
‘శ్రీ కృష్ణతులాభారం’ ముత్తరాజు సుబ్బారావు రాసిన రంగస్థల నాటకం. ఇది భారత, భాగవతాల్లో లేని కవ్పిత కథ. అంతకు ముందు ఎవరు కల్పించారో గాని, ముత్తరాజు సుబ్బారావు నాటకం బాగా ప్రసిద్ధి పొందింది. దాంతో తొలిసారిగా చిత్ర రూపం దాల్చి 1935లో విడుదలైంది. ముఖర్జీ, రాజారామ్ అనే వారు దర్శకత్వం వహించారు. జయసింగ్ అనే ఆయన కృష్ణుడు, ఋష్యేంద్రమణి సత్యభామ, కపిలవాయి రామనాథశాస్త్రి నారదుడు. విశేషం ఏమిటంటే, ఋష్యేంద్రమణి, కాంచనమాల, రేలంగి, లక్ష్మీరాజ్యం వంటి నటులకు ఇదే తొలిచిత్రం! 1955లో రాజరాజేశ్వరీ వారు ఇదే చిత్రం తీశారు. సి.ఎస్.రావు దర్శకుడు కాగా, రఘురామయ్య కృష్ణుడు, సూరిబాబు నారదుడు, ఎస్.వరలక్ష్మి సత్యభామ. ఇదీ బాగానే నడిచింది. 1966లో డి.రామానాయుడు సురేష్ పతాకం కింద మళ్లీ ‘శ్రీ కృష్ణ తులాభారం’ తీశారు. రామారావు కృష్ణుడు, కాంతారావు నారదుడు, జమున సత్యభామ, కమలాకర రామేశ్వరరావు దర్శకుడు.
ఇప్పుడీ వివరాలు ఎందుకంటే మూడు చిత్రాల్లోనూ ‘మీరజాలగలడా’, ‘బలే మంచి చౌక బేరము’, ‘మునివరా తుదకిట్లు ననున్ మోసగింతువా’, ‘కొట్టు కొట్టండిరా... బుర్రపగల కొట్టండి... జుట్టూడ లాగండి... చెవులు మేలేయండి’ − పాటలున్నాయి. ఈ మూడు చిత్రాలకీ సంభాషణ, పాటల రచయితలు వేర్వేరు. కానీ, ‘మీరజాలగలడా నా యానతి’ స్థానం నరసింహారావు రచన. తక్కిన మూడు పాటలూ, ‘కృష్ణతులాభారం’ నాటకానికి చందాల కేశవదాసు అదనంగా రాసినవి. కానీ, మూడు చిత్రాల రచయితల పేర్లతోనే ఈ పాటలూ వెళ్లిపోయాయిగాని, చందాల కేశవదాసు పేరు వెయ్యలేదు! నాటకాలకు కాంతయ్య అనే ఆయన సంగీతం సమకూర్చాడు. ఆ వరసలనే, ఆర్కెస్ట్రావారు, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, పెండ్యాల నాగేశ్వరరావు − అనుసరించారు. ఇంత ప్రసిద్ధి పొందిన పాటల రచయిత చందాల కేశవదాసు − తెలుగు చిత్రాల పాటల రచనకు ఆద్యుడు.
‘భక్తిప్రహ్లాద’ (1932) తీసినప్పుడు, ఉన్న పాటలు చాలవని, అదనంగా కొన్ని పాటలు చందాల కేశవదాసు చేత రాయించారు. దాంతో చిత్రంలోని పాటల సంఖ్య 45.
ప్రహ్లాదలో చందాల వారు రాసిన పాటలు: ‘పరితాప భారంబు భరియింపతరమా’, ‘కటకటానేవిధి గడువంగ జాలదు’ (లీలావతి) ‘తనయా ఇటులన్ తగదురా బలుకా తండ్రి మాట వినక’ (లీలావతి)’ ‘భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా’ (హిరణ్యకశిపుడు).
కేశవదాసు ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో జూన్ 20, 1876న జన్మించారు. పాపమ్మ, లక్ష్మీనారాయణ తలిదండ్రులు, సంగీతం అభ్యసించి హరికథలు చెప్పారు. సాహిత్యంలో ఎక్కువగా కృషిచేసి, నాటకాలు రాయడం కాకుండా అష్టావధానాలు చేశారు. ‘కనకతార’ నాటకం ప్రసిద్ధి చెందిన నాటకం. ఇదే సినిమాగా రెండుసార్లు వచ్చింది − ‘కనకతార’ పేరుతో. ‘కనకతార’ నాటకంలో పాటలు, పద్యాలు, సంభాషణలూ ఆయనే రాశారు. ‘కనకతార’ (1937), (1956) చిత్రాల్లో కేశవదాసు రాసిన పాటలు కొన్ని వాడుకున్నారు. కాని రెండో చిత్రంలో కేశవదాసు పేరు వెయ్యలేదు. మొదటి చిత్రం సముద్రాల వారికి మొదటి చిత్రం. మాటలు ఆయనే రాశారు. పాటలూ రాశారు. ‘‘పాటలు: సముద్రాల, చందాల కేశవదాసు’’ అని టైటిల్స్‌లో వేశారు.
1935లో అరోరా ఫిలిమ్స్ ఆరోరా ఫిలిమ్స్ వారు ‘అనసూయ’ చిత్రాన్ని కోల్‌కత్తాలో తీశారు. ఈ సినిమాకి మాటలు, పాటలు, పద్యాలూ అన్నీ కేశవదాసే రాశారు. ఈ సినిమా విశేషం ఏమిటంటే, తొలిసారిగా ఒక మహిళ చిత్రనిర్మాతగా రావడం. ఆమె దాసరి కోటిరత్నం. ఆమే అనసూయ పాత్రధారణి కూడా. అయితే, ఈ సినిమా బాగా నడవ లేదు. 1936లో సి.పుల్లయ్య బాలలతో తీసిన ‘అనసూయ’ మాత్రం బాగా నడిచింది. ఈ సినిమాతో పాటు ‘ధ్రువవిజయం’ కూడా విడుదల చేశారు. చందాల కేశవదాసు ‘లంకాదహనం’ సినిమాకి కూడా మాటలు, పాటలు, పద్యాలూ రాశారు. ఇది 1936లో వచ్చించి. రాధా ఫిలిం కంపెనీ పేరిట కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించారు. నటేశన్ అనే ఆయన హనుమంతుడిగా నటించారు. (ఈ సినిమాలో వింతగా కనిపించిన విషయం ఏమిటంటే − హనుమంతుడు చెట్టుకింద కూచుని ‘ఎపుడు కృపాకలుగునో’’ అన్న త్యాగరాజకీర్తన పాడడం. ఈ సినిమా సరిగా ఆడక పోవడం వల్లా పాటల పుస్తకం లేకపోవడంవల్లా ఇతర నటుల వివరాలు తెలియరాలేదు.
‘సతీ సక్కుబాయి’ మహారాష్ట్రానికి చెందిన భక్తురాలి కథ. రంగస్థలం నాటకంగా ప్రసిద్ధికెక్కడంతో 1935లో సినిమా తీశారు. భారత్ లక్ష్మీ పిక్చర్స్ పేరిట చారురాయ్ దర్శకత్వంలో కలకత్తాలో నిర్మించారు. చిలకమర్తి లక్ష్మినరసింహం పంతులు, సినిమాకి మాటలు, పాటలూ రాశారు. కొన్ని పాటలు చందాల కేశవదాసు రాశారు. ‘కృషాలపోబోకుమా, రాదేలా కరుణ, ఆటలాడుకోరా, పాలు మీగడ వెన్న పలుమార్లు భుజియించి పాషాణమెటులైతివో’, ‘జాగేలా కానరారుగా’ − పాటలు చందాల రాసినవి. ఇందులోని కొన్నిపాటలు కొద్దిమార్పుతో తర్వాత వచ్చిన రెండు సక్కుబాయి చిత్రాల్లోనూ 1954−1964 ఉపయోగించడం విశేషం.
ఇంకొక విశేషం ఏమిటంటే ‘సక్కుబాయి’ (1935)లో పురుషుడే స్త్రీ పాత్ర ధరించడం! సూరవరపు వెంకటేశ్వర్లు రంగస్థలంమీద ‘సక్కుబాయి’లో అత్త పాత్ర ధరించి ప్రసిద్దిపొందడంతో ఆయన చేతనే సినిమాలో అత్త పాత్ర ధరింపజేశారు! నాటకాల్లో పురుషులు స్త్రీ పాత్రలు ధరించడం, స్త్రీలు పురుషపాత్రలు ధరించడం వుండేది. అయితే, సక్కుబాయి తర్వాత కాబోలు స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలిగాని, పురుషులు వెయ్యరాదు’ అన్న నిబంధన విధించారు ప్రభుత్వం, సెన్సార్‌వారూ. మారువేషాలు వేసుకుని, స్త్రీలు పురుషపాత్రల్లోనూ, పురుషులు స్త్రీ పాత్రల్లోనూ కనిపించవచ్చు అది వేరు.
చందాల కేశవదాసు నాటక రచయిత మాత్రమే కాదు ‘పాటల రచయిత మాత్రమే కాదు’ భజన పాటలు రాశారు. హరికథలు రాశారు. చెప్పేవారు. అంతేకాదు ఆయన దానశీలి. భక్తుడు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ దగ్గర్లో వున్న సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని జీర్ణోద్దరణ కావించారు. ఒక విశేషం ఏమిటంటే కేశవదాసు, నాటకాల ముందు పాడవలసిన ప్రార్థన గీతం ‘పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ ఆనాడు రచిస్తే ఆనాటి నుంచి నేటి వరకు అదే ప్రార్థనగీతం పురాణనాటక ప్రదర్శకులు ఆలపిస్తున్నారు! ఆయన కీర్తి అజరామరం.
రావి కొండలరావు
హీరోయిన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు