పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ నియమించబడ్డారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో పీఏసీ ఛైర్మన్‌గా ఆయనను ఎన్నుకున్నారు. సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. 1958 నుంచి పీఏసీ కమిటీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్‌గా ప్రతిపక్షనేతను నియమించడం ఆచారంగా వస్తుందని తెలిపారు.
పీఏసీ ఛైర్మన్‌గా ఎంపికైన అక్బరుద్ధీన్ ఓవైసీకి స్పీకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పీఏసీ కమిటీ మిగితా కమిటీల కంటే భిన్నమైనదనీ, ప్రభుత్వాల పనితీరు, పాలన పారదర్శకంగా కొనసాగాలని పోచారం అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అనగుణంగా, ఆయా శాఖలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అని పరిశీలించి ప్రభుత్వానికి నివేధిక అందజేయడం ఈ కమిటీ విధి అని తెలిపారు.