telugu navyamedia
క్రీడలు వార్తలు

ఒక్క సిరీస్ కే ఇలా అంటే ప్రపంచ కప్ ఎలా…?

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టీ20ల్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఒకే పరుగు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. రెండు, మూడు టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో రాహుల్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే రాహుల్‌కు ఆకాష్చోప్రా అండగా నిలిచాడు. ఈ స్టార్ బ్యాట్స్‌‌మన్‌పై వస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా తిప్పికొట్టాడు. త్వరలోనే ఓ పెద్ద ఇన్నింగ్స్‌‌తో రాహుల్ తన సత్తా చాటుతాడని ధీమా వ్యక్తం చేశాడు. ‘మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన మ్యాచ్ విన్నర్‌పై విమర్శలు గుప్పిస్తే.. మనం ప్రపంచకప్ గెలిచే జట్టును నిర్మించలేం. ఈ రోజు రాహుల్ విఫలమయ్యాడు. రేపు ఇషాన్ కిషాన్.. ఎల్లుండి రిషభ్ పంత్ రాణించలేకపోతారు. వారిపై కూడా ఇలానే విమర్శలు గుప్పిస్తే.. ఆటగాళ్లలో అభద్రతా భావం నెలకొంటుంది.’అని చోప్రా పేర్కొన్నాడు. అయితే గతేడాది రిషభ్ పంత్ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో టీమిండియా ఫస్ట్ చాయిస్ కీపర్‌గా జట్టులో కొనసాగాడు. కానీ ఇటీవల పంత్ ఫామ్‌లోకి రావడం.. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అందర్ని మెప్పించడంతో రాహుల్ పాత్రపై గందరగోళం ఏర్పడింది.

Related posts