telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఆర్మీలో చేరాలనే కల..నెర‌వేర‌కుండానే ఊపిరొద‌లాడు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామోదర రాకేశ్ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్​పేట. రాకేశ్ వయసు 18 సంవత్సరాలు. 

రాకేశ్​​ది నిరుపేద కుటుంబం.​ వ్యవసాయమే వారి జీవనాధారం. తల్లిదండ్రులు కుమారస్వామి-పూలమ్మ. మృతునికి ఇద్దరు అక్కలున్నారు. వారికి వివాహాలయ్యాయి. పెద్దక్క ప్రస్తుతం పశ్చిబెంగాల్‌లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా ఉన్నారు..రాకేశ్​ హనుమకొండలో డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు.

6 నెలల క్రితం జరిగిన ఆర్మీ రిక్రూట్​మెంట్ ర్యాలీలో ఫిజికల్ టెస్ట్​ పరీక్ష పాసై.. ఇప్పుడు ప్రవేశపరీక్షకు సన్నద్ధమవుతున్నాడు.ఇంతలోనే విధి వక్రించింది. కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్.. తమ ఆశలపై నీళ్లు చల్లేదని తోటివారిలాగే గందరగోళానికి గురయ్యాడు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా గళమెత్తాడు. చివరకు పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు.

దామోదర రాకేశ్​​ స్వగ్రామం ఖానాపురం మండలం దబీర్ పేటలో విషాదం అలుముకుంది. రాకేష్ ఇంటి దగ్గరకు బంధువులతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. రాకేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. దామెర రాకేశ్‌ మృతికి నిరసనగా రేపు నర్సంపేట నియోజకవర్గం బంద్​కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పిలుపునిచ్చారు.

‘అగ్నిపథ్‌’ను ప్రశ్నిస్తే హత్య చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రేపు నియోజకవర్గ బంద్‌లో అందరూ పాల్గొనాలని పెద్ది విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన రాకేశ్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబసభ్యులు, బంధువులను పరామర్శించారు.

Related posts