నిత్యం ప్రజలకు రక్షణ కల్పించడంలో బిజీగా ఉండే పోలీసు ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి సెలవులు తీసుకునేందుకు ఆస్కారం లేకపోవడం వల్ల తమ కుటుంబసభ్యులకు ఎన్నో రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ల చిన్న చిన్న సరదాలను కూడా కోల్పోతుంటారు. ఇక మీదట అలా జరగకూడదని భావించిన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. పోలీసుల పుట్టినరోజు నాడు వాళ్లకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోజు కుటుంబసభ్యులతో సంతోషంగా గడపడం వల్ల వాళ్లు ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తున్నారు. అంతేకాదు.. వాళ్ల పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డు, స్వీట్ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయంతో దాదాపు 3వేల మంది పోలీసులకు అవకాశం లభించనుంది. ‘ఇలా చేయడం వల్ల సిబ్బంది వాళ్ల బర్త్ డే రోజు కుటుంబసభ్యులతో ప్రత్యేకంగా ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ప్రత్యేకమైన రోజున తమ వాళ్లతో ఉండలేకపోతున్నామనే భావన వారికి ఉండదు. ఎటువంటి ఒత్తిడి లేకుండా విధులను చక్కగా నిర్వర్తించగలుగుతారు. పోలీస్ ఉద్యోగం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ల చిన్న చిన్న సంతోషాలను ఈ విధంగా నెరవేర్చడం వల్ల ఉద్యోగులు ఆనందంగా ఉంటారు’ అని రాయ్పూర్ సీనియర్ పోలీస్ అధికారి షేక్ అరిఫ్ హుస్సేన్ తెలిపారు.
ఈ వినూత్న ఆలోచనను ఇప్పటికే బిలాస్పూర్ జిల్లాలో అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పుట్టినరోజు వివరాలను సేకరించి వాళ్లు ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారో అక్కడికి ఆ రోజున శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డు, స్వీట్ బాక్స్ పంపిస్తారు. అంతేకాదు.. విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులో సదరు ఉద్యోగి పేరు రాసి బర్త్ డే విషెస్ చెబుతారు. ఇందుకు అయ్యే ఖర్చును పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఉపయోగించనున్నారు.
ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే: జేసీ