telugu navyamedia
క్రీడలు వార్తలు

మళ్ళీ భారత మహిళా జట్టు కోచ్‌గా రమేశ్‌ పొవార్‌…

భారత మహిళా క్రికెట్​ జట్టు ప్రధాన కోచ్​గా మాజీ స్పిన్నర్​ రమేశ్​ పొవార్​ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అయితే 2018 లోనూ భారత మహిళా క్రికెట్​ జట్టుకు కోచ్​గా పనిచేసిన పొవార్.. సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్‌తో గొడవపడి వేటుకు గురయ్యాడు. పొవార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలుచుకునే సువర్ణవకాశాన్ని కోల్పోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాటి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగానే పొవార్ సీనియర్ ప్లేయర్ అయిన మిథాలీ రాజ్‌ను తప్పించారు. దాంతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక తనను జట్టు నుంచి తప్పించడంపై మిథాలీ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐకి పొవార్‌పై మెయిల్ ద్వారా ఫిర్యాదు కూడా చేసింది. నా 20 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో తొలి సారి నేను చాలా బాధపడ్డాను. అవమానానికి గురయ్యాను. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలని ప్రయత్నించారు. నేను క్రికెట్‌ ఆడకుండా కొంతమంది కుట్రపన్నారు. ఈ విషయంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌పై నాకెలాంటి వ్యతిరేకత లేదు. నన్ను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్‌ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే ఎంతో బాధించింది. క్షోభకు గురిచేసింది. దేశం కోసం ప్రపంచకప్‌ గెలవాలనుకున్నా. కానీ మేం ఓ బంగారంలాంటి అవకాశం కోల్పోయాం.’అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది. మిథాలీ ఫిర్యాదుతో కోచ్ పొవార్‌పై బీసీసీఐ వేటు వేసింది. అతను మరోసారి కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నా.. పక్కనపెట్టేసింది. డబ్ల్యూవీ రామన్‌‌ను కోచ్‌గా నియమించింది. చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది.

Related posts