telugu navyamedia
క్రీడలు వార్తలు

మళ్లీ దినేశ్ కార్తీక్‌ చేతిలోకి కేకేఆర్ పగ్గాలు…?

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 అర్దంతరంగా వాయిదాపడటం ఆ జట్టుకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఓ వైపు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను పూర్తి చేస్తామని బీసీసీఐ ప్రకటించగా.. సెకండ్ ఫేజ్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను నడిపించే నాయుకుడు ఎవరా? అనే సందిగ్దత నెలకొంది. ఆ జట్టు ప్రస్తుత సారథి, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పరిస్థితులను గమనిస్తుంటే మళ్లీ దినేశ్ కార్తీక్‌కే జట్టు సారథ్య బాధ్యతలు దక్కెలా ఉన్నాయి. అయితే టీమిండియాతో ఐదు టెస్టుల అనంతరం ఇంగ్లండ్‌కు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. ఇవన్నీ ముందే నిర్ణయించుకున్నవి కాబట్టి క్రికెటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయబోమని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ స్పష్టం చేశారు. అంటే ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, మొయిన్‌ అలీ, జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌ సహా చాలామంది ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరు. మోర్గాన్‌ కూడా ఉండడు కాబట్టి కోల్‌కతాకు సారథ్య సమస్య ఏర్పడింది. గత సీజన్‌ మధ్య వరకు దినేశ్‌ కార్తీక్‌ కేకేఆర్‌ జట్టును నడిపించాడు. ఆశించిన రీతిలో అతను జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. దాంతో అతనే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇయాన్ మోర్గాన్‌ను జట్టు యాజమాన్యం తమ సారథిగా ప్రకటించింది. డీకే వైస్‌కెప్టెన్‌గా అతడికి తోడుంటాడని తెలిపింది. అయితే మోర్గాన్‌ కూడా ఈ సీజన్​లో ఆ జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు. 7 మ్యాచులకు 2 గెలిపించాడు. ఇంకా ఆడాల్సినవి ఏడే కాబట్టి మిగిలిన సీజన్‌లో డీకేకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.

Related posts