telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొంత మందికి మాత్రమే తెలిసిన ఇర్ఫాన్ ఖాన్ ప్రేమ కథ…

irfan khan

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని వెర్సోవా శ్మశానవాటిలో పూర్తయ్యాయి. ఇర్ఫాన్ ఖాన్‌కు భార్య సుతాపా సిక్దర్, ఇద్దరు కొడుకులు బాబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్ ఖాన్ గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రేమ కథ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇర్ఫాన్ భార్య సుతాపా సిక్దర్ కూడా ఆయన వెంట సినీ ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటారు. కానీ, ఎప్పుడూ ప్రజల కంట్లో పెద్దగా పడలేదు. ఇర్ఫాన్ ఖాన్, సుతాపా ఇద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో క్లాస్ మేట్స్. ఆ రోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్‌లో ఉన్న కళను కనిపెట్టారు మీరా నాయర్. 1986లో మీరా నాయర్ సలాం బాంబే కోసం పనిచేస్తున్న సమయంలో ఆమె ఇర్ఫాన్ ఖాన్‌లో ఉన్న నటుడిని పసిగట్టారు. ఇర్ఫాన్ ఫోకస్, నిశితంగా గమనించే తత్వం, ఆ లుక్, ఆ కళ్లను ఆమె బాగా గమనించారు. సినిమా మీద, కళ మీద ఇర్ఫాన్, సుతాపా ఇద్దరికీ ఉన్న ప్రేమ ఆ ఇద్దరినీ ప్రేమలో పడేసింది. సలాం బాంబే సినిమా కోసం మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్‌ను తీసుకున్నారు. అయితే, ఆ సినిమాలో తొలుత అతడికి అనుకున్న క్యారెక్టర్ వేరు. ఓ వీధి బాలుడి క్యారెక్టర్ అనుకున్నారు. అయితే, సరైన పోషకాహారం లేకుండా వీధుల వెంట తిరితే బాలల్లో ఓ రకమైన నిస్సత్తువ ఉంటుంది. అలాంటి కళ ఇర్ఫాన్‌లో మీరా నాయర్‌కు కనిపించలేదు. దీంతో అతడి క్యారెక్టర్‌ను మార్చి ఓ టైపిస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. అందుకు ఇర్ఫాన్ చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో సుతాపానే ఇర్ఫాన్‌కు అండగా నిలిచింది.

1995 ఫిబ్రవరి 23న ఇర్ఫాన్ ఖాన్, సుతాపా పెళ్లి జరిగింది. ఈ 25 సంవత్సరాల సంసారంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. 2003లో విశాల్ భరద్వాజ్ తీసిన మక్బూల్ సినిమాలో బ్రేక్ వచ్చేంత వరకు ఇర్ఫాన్ ఖాన్ పెద్దగా ప్రపంచానికి తెలీదు. ఆ తర్వాత 2006లో మీరా నాయర్ దర్శకత్వంలో వచ్చిన ది నేమ్ సేక్ అతడి జీవితాన్ని మార్చేసింది. సుతాపా సినిమా డైలాగ్ రైటర్. కామోషీ, శబ్ద్, కహానీ వంటి సినిమాలకు మాటలు రాశారు. ఆ తర్వాత మదారి 2016, కరీబ్ కరీబ్ సింగిల్ 2017లో నిర్మాతగా మారి ఇర్ఫాన్ ఖాన్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీశారు. 2018లో ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సన్ బారిన పడ్డాడు. అందుకు ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. అప్పుడు మళ్లీ అతడి జీవితం తిరగబడింది. 2018 మార్చిలో తన భర్త గురించి సుతాపా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తన భర్తను ఓ వారియర్‌గా అభివర్ణించింది. లండన్‌లో క్యాన్సర్ చికిత్స తీసుకుని వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో తన భార్య సుతాపా గురించి ఇర్ఫాన్ చెప్పిన మాటలు ఇవే. సుతాపా గురించి ఏం చెబుతాం. 24 గంటలూ నాతోనే ఉంది. నేను బతకడానికి ఎన్ని రకాల సేవలు చేయాలో అన్నీ చేసింది. నేను ఆమె కోసం బతకాలనుకుంటున్నా. అని చెప్పాడు.

Related posts