విజువల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ పేరిట రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు రానున్నాయి. ఇప్పటివరకు బీఏ, బీకాం కోర్సుల వ్యవధి మూడేళ్లు కాగా, ఈ కొత్త కళాశాలల్లో మాత్రం కొన్ని కోర్సులను బీటెక్ తరహాలో నాలుగేళ్లు అందించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కొత్త డిగ్రీ కళాశాలలకు అనుమతివ్వని ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులతోపాటు గతేడాది వరకు ఎంఓయూ విధానంలో నడుస్తున్న కోర్సులను వచ్చే నూతన విద్యా సంవత్సరం నుంచి కొనసాగించరాదని నిర్ణయించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విజువల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటన జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఏడు రకాల కొత్త డిగ్రీ కోర్సులు ఈ కళాశాలల్లో అందుబాటులోకి వస్తాయి. బీఏ (హానర్స్) డిజైన్, బీఏ (హానర్స్) ఫిల్మ్ అండ్ మీడియా, బీఏ (హానర్స్) విజువల్ ఆర్ట్స్, బీఏ.. ఈ నాలుగు కోర్సుల వ్యవధి మూడేళ్లు. ఇక బీఎస్‌సీ (హానర్స్) కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్‌మెంట్, బీఏ (హానర్స్) గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, బీఏ (హానర్స్) మాత్రం నాలుగేళ్ల కోర్సులుగా అందిస్తారు. వీటిల్లో ప్రవేశానికి ఇంటర్ లేదా సమాన విద్యార్హత ఉండాలి.
హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) తో యానిమేషన్, మల్టీమీడియా, ఫిల్మ్ తదితరాల పేరిట పలువురు ఎంఓయూ కుదుర్చుకొని బీటెక్, ఎంటెక్ పేరిట కోర్సులు అందిస్తున్నారు. అయితే ఏఐసీటీఈ అనుమతి లేకుండానే బీటెక్, ఎంటెక్ కోర్సులను ఎలా అందిస్తారని కొందరు ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏఐసీటీఈ అధికారులు అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్యకు లేఖ రాశారు. దాని తో ఆమె ఒప్పందాలను రద్దు చేసి కోర్సులను ఆపివేయాలని ఆదేశించారు. ఒకవేళ బీటెక్, ఎంటెక్‌పేరిట అందించాలంటే ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలని సూచించారు.
సొంత స్థలం, భవనాలు, అర్హులైన అధ్యాపకులు ఉంటేనే ఏఐసీటీఈ అనుమతి లభిస్తుంది. దాని తో బీఏ, బీఎస్‌సీ కోర్సులుగా మార్చుకుంటే రాష్ట్రస్థాయిలోనే అనుమతులు పొందొచ్చని, లీజు తీసుకున్న భవనంలోనూ కళాశాలలను నడిపించవచ్చని ఆయా సంస్థలు భావించాయి. ఈ క్రమంలోనే డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీఎస్‌ఈ కోర్సులుగా అందించేందుకు ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. ఐదేళ్ల వరకు మాత్రమే లీజు తీసుకున్న భవనంలో నడిపించుకోవాలన్నది నిబంధన. అయితే దీన్ని దశాబ్దాలుగా పొడిగిస్తూ వస్తుండటం గమనార్హం. దాదాపు 10-15 వరకు కళాశాలలు ఏర్పాటు కావొచ్చని అంచనా వేస్తున్నారు.
“కార్తీక దీపం” సీరియల్ పై దర్శకుడి వెదవ కామెంట్స్… !?