telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మేడారం జాతరకు .. ముమ్మర ఏర్పాట్లలో ప్రభుత్వం.. 75కోట్ల నిధులు విడుదల..

funds to telangana by central govt

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీవరకు ఈ జాతర జరుగనున్నది. ఇందులో భాగంగా వసతుల కల్పనకు 21శాఖలకు రూ.75 కోట్ల నిధులను విడుదలచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు.. ములుగు జిల్లాలో గిరిజన సంస్కృతికి ప్రతీకగా జరుపుకొనే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణకు నిధుల మంజూరుపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జాతర ఏర్పాట్లపై త్వరలోనే మేడారంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

సమ్మక్క-సారలమ్మ జాతరలో రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని సమన్వయంతో పనిచేయాలన్నారు. శాఖలవారీగా నిధుల కేటాయింపు జరిగిన నేపథ్యంలో ఆయాశాఖల అధికారులు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని చెప్పారు. జాతర నిర్వహణలో భాగంగా వివిధ శాఖలవారీగా నిధులను కేటాయించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.19 కోట్లు, పోలీస్‌శాఖకు రూ.11 కోట్లు, రోడ్లు, భవనాలశాఖకు రూ.8.05 కోట్లు, రెవెన్యూశాఖకు రూ.7.50 కోట్లు, నీటిపారుదల రూ.4 కోట్లు, గిరిజన సంక్షేమం రూ.4 కోట్లు, ఎన్పీడీసీఎల్ రూ.4 కోట్లు, జిల్లా పంచాయతీ అధికారి రూ.3.65 కోట్లు, పంచాయతీరాజ్ రూ.3.50 కోట్లు, దేవాదాయ రూ.3 కోట్లు, ఆర్టీసీ రూ.2.48 కోట్లు, వైద్యారోగ్యం రూ.1.46 కోట్లు, అటవీశాఖకు రూ.1.20 కోట్లు కేటాయించారు.

Related posts