telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ మాజీల పై గవాస్కర్ ఫైర్…

sunil gavaskar on bcci

రెండో టెస్ట్ జరుగుతున్న చెపాక్ పిచ్‌పై సెటైర్లు వేస్తున్న ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్లపై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. ఇంగ్లండ్‌లో రోజంతా బాల్ స్వింగ్ అవుతూనే ఉంటుంది కదా!, అలాంటి పిచ్‌పై ఆస్ట్రేలియా 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన‌ప్పుడు.. ఇప్పడు మాట్లాడినవారు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు అని ప్ర‌శ్నించారు. అప్పుడు లేవ‌ని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అని మండిపడ్డారు. తొలి రోజు నుంచే స్పిన్‌కు స‌హ‌క‌రిస్తున్న చెపాక్ పిచ్‌పై కెవిన్ పీట‌ర్స‌న్‌, మైకేల్ వాన్‌ లాంటి ఇంగ్లండ్ మాజీలు విమ‌ర్శలు చేశారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవ‌లం 134 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. అనూహ్యంగా టర్న్ అవుతున్న చెపాక్ పిచ్‌పై ఒక్క ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ కూడా నిలవలేకపోయాడు. దీంతో బ్యాట్స్‌మన్ ‌చెపాక్ పిచ్‌పై ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ సెటైర్ వేశాడు. ‘విరాట్ కోహ్లీ టాస్ బాగా వేశాడు. ఒక‌వేళ భారత్ టాస్ ఓడిపోయి ఉంటే.. ఇంగ్లండ్ సిరీస్‌లో 2-0 లీడ్ సాధించేది’ అని కేపీ ట్వీట్ చేశాడు. ‘ఇప్పుడు క్రికెట్‌ వినోదభరితంగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఈ పిచ్ షాకిస్తోంది. భారత్ మెరుగ్గా ఉన్నందున ఎటువంటి సాకులు చెప్పడం లేదు. కానీ ఇది 5 రోజులకు సిద్ధం చేసిన పిచ్ మాత్రం కాదు’ అని మైకేల్ వాన్‌ పేర్కొన్నాడు.

చెపాక్ పిచ్‌పై కెవిన్ పీట‌ర్స‌న్‌, మైకేల్ వాన్‌ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. ‘ఇదే పిచ్‌పై రోహిత్ శర్మ ఎలా 150కిపైగా ప‌రుగులు చేశాడు. పిచ్ బాలేకపోతే 330 పరుగులు చేయడం అసాధ్యం. ఇలాంటి విమ‌ర్శ‌లు స‌రికావు. తొలి రోజు నుంచే బంతి ట‌ర్న్ అవ‌డంపై అందరూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఇంగ్లండ్‌లో సీమింగ్ పిచ్ సంగ‌తి ఏంటి?. రోజంతా అక్క‌డ ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది. దాని గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. ఎప్పుడూ ఇండియ‌న్ పిచ్‌ల గురించే మాట్లాడ‌తారు. బాల్ ట‌ర్న్ అయితే వాళ్ల‌కు స‌మ‌స్య మొద‌లువుతుంది’ అని సన్నీ అన్నారు. ‘భారత్‌లో బంతి ట‌ర్న్ అయితే చాలు కొందరికి నోరు లేస్తుంటుంది. ఎదో వ్యాఖ్యలు చేస్తారు. మ‌రి ఇంగ్లండ్ పిచ్‌పై ఆస్ట్రేలియా 46కే ఆలౌటైన‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌లేదు. వీళ్ల‌కు ఇండియా అంటే న‌చ్చ‌దు. పిచ్ గురించి కాదు.. మ్యాచ్‌లో ఆడే బౌల‌ర్లు, బ్యాట్స్‌మెన్ నైపుణ్యం గురించి చ‌ర్చ జ‌ర‌గాలి’ అని టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. అయితే సన్నీ వ్యాఖ్యలను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ బుట్చేర్ సమర్ధించారు. ‘ఆస్ట్రేలియన్లు దాని గురించి చాలా బాధపడతారు. నేను అంగీకరిస్తున్నా’ అని పేర్కొన్నారు.

Related posts