telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఐక్యరాజ్యసమితి .. గుడ్‌విల్ అంబాసిడర్ గా .. భారత సంతతికి చెందిన పద్మాలక్ష్మి..

anglo indian padma lakshmi as un goodwill ambassador

భారత సంతతికి చెందిన అమెరికా రచయిత, నటి, మోడల్, టీవీ ప్రయోక్త పద్మాలక్ష్మి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూన్‌డీపీ) సౌహార్ద రాయబారి(గుడ్‌విల్ అంబాసిడర్)గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీల)సాధనకు మద్దతు కూడగడతారని యూఎన్‌డీపీ తెలిపింది. అసమానతలు, వివక్షలను పారదోలడంపై, నిరాదరణకు గురైన వారికి సాధికారత కల్పించడంపై ఆమె ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పింది.

అమెరికాలోని న్యూయార్క్‌లో యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మాలక్ష్మి మాట్లాడుతూ, ప్రపంచంలో మహిళలు, బాలికలు అత్యంత తీవ్రమైన వివక్షను, కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతలు పేద దేశాల ప్రజలపైనే కాదు సంపన్న దేశాల ప్రజలపైనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తాయనే వాస్తవాన్ని సౌహార్ద రాయబారిగా అందరి దృష్టికీ తీసుకెళ్తానని ఆమె చెప్పారు. చాలా దేశాలు పేదరికాన్ని బాగా తగ్గించాయి. కానీ అసమానతలు మాత్రం తొలగిపోవడం లేదు. లింగ వివక్ష, వయసును బట్టి చూపే వివక్ష, జాతిని బట్టి చూపే వివక్ష వల్ల అసమానతలు ఇంకా తీవ్రమవుతున్నాయి.

ఈ పరిస్థితులు మహిళలపై, మైనారిటీలపై చాలా ప్రభావం చూపిస్తాయి” అని పద్మాలక్ష్మి విచారం వ్యక్తంచేశారు. మార్చి 8 మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒక్క రోజు ముందు పద్మాలక్ష్మి నియామకం జరిగింది. ఈ నియామకంపై ఆమె స్పందిస్తూ- ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. ఇప్పుడు 48 ఏళ్ళున్న పద్మాలక్ష్మి 16 ఏళ్ల వయసులో తాను అత్యాచారానికి గురయ్యానని గత ఏడాది సెప్టెంబరులో వెల్లడించారు. కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన జడ్జి బ్రెట్ కేవెనాపై ఇద్దరు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన సమయంలో ద న్యూయార్క్ టైమ్స్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పద్మాలక్ష్మి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏళ్ల కిందటే అత్యాచారం జరిగితే ఇప్పటివరకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.

ఆ ఇద్దరు మహిళలూ ఇంతకాలం ఆ విషయం ఎందుకు చెప్పలేదో నేను అర్థం చేసుకోగలను. 32 ఏళ్లుగా నేనూ అలాగే మౌనంగా ఉన్నాను కదా అని ఆమె తన వ్యాసంలో రాశారు. తన పొరపాటు వల్లే లైంగిక దాడికి గురైనట్లు భావించే దానినని, మహిళలు తమపై జరిగే లైంగిక దాడుల గురించి బయట ప్రపంచానికి ఎందుకు చెప్పరో కూడా తనకు ఆ తరువాతే అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

Related posts