గతంలో చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దొంగతనాలకు వచ్చి అడ్డు తిరిగిన వాళ్లను అడ్డంగా లేపేసే డేంజర్ గ్యాంగ్. అప్పుడు పోలీసులు అప్రమత్తం కావడంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడినట్లయింది. కానీ, తాజాగా మళ్ళీ నగర శివారులో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోవడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో దొంగలు విరుచుకుపడ్డారు. ఒకే రోజు మూడు చోట్ల చోరీలు జరగడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. హనుమాన్ నగర్‌లో ఉండే తోటపల్లి అంజిరెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి 5 తులాల బంగారు ఆభరణాలు, 5 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ ఇంటి పక్కనే ఉన్న గుడిసెలో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.
అనంతరం సత్తిరెడ్డి కాలనీలో కూడా బీభత్సం సృష్టించారు. వేద పాఠశాల ప్రధాన ద్వారం పగులగొట్టి లోనికి ప్రవేశించిన చెడ్డీగ్యాంగ్ ముఠా సభ్యులు అక్కడి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కిశోర్ స్వామి భార్య మెడలో నుంచి 10 తులాల బంగారం, లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. అయితే చెడ్డీగ్యాంగ్ ఆ రెండు ప్రాంతాల్లో రెండు మూడు గంటల పాటు రెచ్చిపోయినట్లు స్థానికులు చెబుతున్నదాన్ని బట్టి తెలుస్తోంది. దుండగులు కేవలం బనియన్లు, చెడ్డీలు మాత్రమే ధరించి వచ్చినట్లు పోలీసులకు వివరించారు. వారి చేతిలో ఇనుపరాడ్లు ఉండటంతో బాధితులు భయపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నా గురించి దేవేగౌడ అసత్యాలు మాట్లాడారు: సిద్ధరామయ్య ఫైర్