telugu navyamedia
సినిమా వార్తలు

“118” మా వ్యూ

118

బ్యానర్ : ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు : నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదా థామ‌స్, నాజ‌ర్‌, ప్ర‌భాస్ శ్రీను, అశోక్ కుమార్‌, రాజీవ్ క‌న‌కాల, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ త‌దిత‌రులు
క‌థ‌, ఛాయాగ్ర‌హ‌ణం, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌
సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌
ఫైట్స్ : వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌,
నిర్మాత‌ : మ‌హేష్ కొనేరు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా “118” అంటూ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయగానే… ఒక్కసారిగా అందరి దృష్టి సినిమాపైకి మళ్లింది. ఆ తరువాత టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. “నా నువ్వే” సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన కళ్యాణ్ రామ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడా ? ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ :
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఓ ఛానెల్ లో పని చేస్తుంటాడు గౌత‌మ్ (కళ్యాణ్ రామ్). అతనికి అప్పటికే తన మరదలు మేఘ (షాలిని పాండే)తో వివాహం కుదురుతుంది. ఓసారి ఓ రిసార్టుకు వెళ్లిన గౌతమ్ అక్కడ 118 అనే రూమ్ లో ఉంటాడు. ఆరోజు రాత్రి 1.18 నిమిషాలకు అతనికి ఓ కల వస్తుంది. పెద్దగా పట్టించుకోడు గౌతమ్. ఆ తరువాత మరోసారి అదే రిసార్టులో స్టే చేసిన గౌతమ్ కు అదే టైంకు మరోసారి అదే కల వస్తుంది. దీంతో అప్పటినుంచి ఆ కల గురించి ఆలోచించడం మొదలుపెడతాడు గౌతమ్. అసలు గౌతమ్ కు వచ్చిన కల ఏంటి ? ఆ రిసార్టులోనే, ఆ టైంకే ఆ కల ఎందుకొస్తుంది ? అసలు ఈ సినిమా కథలో నివేదా థామస్ పాత్ర ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
ఈ చిత్రంలో తన కలలోకి వచ్చిన అమ్మాయిని వెతకడమే హీరో పని. రొమాన్స్, టెన్షన్ తదితర భావాలను తెరపై సహజంగా పలికించాడు ప్రయత్నించాడు కళ్యాణ్ రామ్. ఇదివరకెప్పుడూ చేయని సరికొత్త పాత్రతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చాడు. ఇక షాలిని పాండే గ్లామర్ తో మెప్పిస్తుంది. కానీ ఆమె పాత్రకు సినిమాలో చాలా తక్కువ నిడివి ఉంది. నివేదా థామస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నివేదా పాత్ర ఉండేది కూడా తక్కువ సమయమే. కానీ ఆమె పాత్ర ప్రభావం సినిమా మొత్తం ఉంటుంది. ఇక హరితేజ, మీనా, ప్రభాస్‌ శీను, రాజీవ్‌ కనకాల, ‘ఛమక్‌’ చంద్ర, నాజర్‌ తదితరులు తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
గుహన్‌ రాసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే, బలమైన కథనంతో ఆసక్తి రేకెత్తించాడు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఆసక్తికరంగా నడుస్తుంది క‌థ. కానీ ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా నెమ్మదిగా, పేల‌వంగానే సాగుతుంది. తెలిసిన కథనే కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయ్. ఆద్య (నివేదా థామస్‌) ఫ్లాష్‌ బ్యాక్‌ అందుకు ఉదాహరణ. అయితే మొత్తానికి క్రైమ్‌ థ్రిల్లర్‌ ను తెరపై చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. నేపథ్య సంగీతం బాగుంది. ఉన్న ఒక్కపాట బాగుంది. కెమెరా పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.75/5

Related posts