telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీబీఐ వాంగ్మూలంలో సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు సునీతారెడ్డి… ఈ కేసులో సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టారు..

మా నాన్నను ఎవరు చంపారో పులివెందులలో చాలామందికి తెలుసు… హంతకులు ఎవరో తేల్చాలని అన్నజగన్ ను కోరాను.. అనుమానితుల పేర్లు కూడాచెప్పాను… వాళ్ళని ఎందుకు అనుమానిస్తావ్‌.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థ తో విచారణ చేయించాలని సవాల్ చేశాను.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది? అవినాష్ రెడ్డి బిజెపిలో చేరతాడు.. అతనికి ఏమీ కాదు.. 11కేసులకు మరొకటి అని ముఖ్యమంత్రి జగన్ మాట్లాడడం తనను బాధించింది అని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి (జగన్ భార్య భారతి తండ్రి) ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్ కుమార్ రెడ్డి పేరు చేర్చడం పైన జగన్ కోప్పడ్డారని వాపోయారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా ఎవరో కాంపౌండర్ ఎక్కువయ్యారని.. తన తండ్రి మరణవార్తతో సంబరాలు చేసుకోవడానికి బాణాసంచా కొనుగోలుకు యత్నించిన వ్యక్తిని ఎలా వదిలిపెట్టారో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనకు న్యాయం లభించదు అన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

రాజకీయంగా తన తండ్రి వివేకాపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కక్ష పెంచుకున్నారు అని చెప్పారు. హత్య జరిగిన రోజు కూడా నాన్న మరణించారని మొదట భారతికి, తర్వాత జగన్ కు ఫోన్ చేసి చెబితే.. అవునా.. అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, ఆశ్చర్యం, బాధ లాంటివి కొంతైనా కనిపించలేదన్నారు. 2020 జూలై 7న సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

పోస్టుమార్టంవద్దంటే..అయిపోయిందన్నారు

2019 మార్చి 15న ఉదయం 5:30కు నా భర్త రాజశేఖర్ రెడ్డికి పులివెందుల నుంచి ఫోన్ వచ్చింది. ఆదుర్దాగా మాట్లాడుతుంటే నేను, మా అమ్మ గమనించాం. అడగగానే మీ నాన్న చనిపోయాడు అని చెప్పారు. వెంటనే రెండు కార్లలో హైదరాబాద్ నుంచి బంధువులతో కలిసి పులివెందులకు బయలుదేరాం. ఉదయం 7:30 కు టీవీలో వార్తల్లో గుండెపోటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నా భర్తకు ఎన్ వి కృష్ణారెడ్డి ఫోన్ చేసి కేసు పెట్టమంటారా అని అడిగాడు. అదే సమయంలో వివేకా సహాయకుడు ఇనయతుల్లా వాట్సాప్ నుంచి ఫోటోలు వచ్చాయి. అవి నా భర్తకు చూపించాను.

రక్తంతోపాటు, తలపై గాయాలు చూస్తే అమ్మ భయపడుతుందని మాట్లాడకుండా చూపించా… కారులో నా పక్కనే కూర్చున్న మా అమ్మ ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేయమంటే.. ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి… మేము పులివెందులకు వచ్చేదాకా పోస్ట్మార్టం చేయొద్దని చెప్పా. మా బంధువు డాక్టర్ అభిషేక్ రెడ్డికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాను.. కాసేపటికి ఇంకో ఫోన్ వచ్చింది. పోస్టుమార్టం పూర్తయిందని…కుట్టేసి కట్లు కట్టేశారని చెప్పారు. బంధువులు ఎవరు నోరు మెదపలేదు. అనుమానం ఇంకా బలపడింది. ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని తెలిసింది.

నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని ఖరారైంది. వెంటనే సీఐ శంకరయ్యకు నా భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ చేసి కేసు రిజిస్టర్‌ చేయమని చెప్పారు. నాన్న హత్య గురించి తెలిసినా పులివెందులలో ఉన్న అనుమానితులు.. అంత్యక్రియలు ఈ రోజే అయిపోవాలని హడావుడి చేస్తున్నారు.. దీంతో అమ్మ ఒకసారి విషయం జగన్‌కు చెప్పమనడంతో అన్నకు ఫోన్‌ చేశా.. నేను చూసుకుంటానన్నారు.

నాన్న హత్యతో జగన్ ఎన్నికల్లో లాభపడ్డారు..

నా తండ్రి హత్యను వైఎస్‌ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారన్న సీబీఐకి తెలిపారు సునీతారెడ్డి…నా తండ్రి హంతకులను శిక్షించాలని అన్న జగన్ కు సజ్జల, సవాంగ్ తదితరుల సమక్షంలో బతిమాలాను. ఉదయ్ కుమార్ రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు అతడి పేరు పెట్టావ్… ఎన్ వి కృష్ణారెడ్డి( వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్ రెడ్డి హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదు అన్నారు. వెంటనే జగన్తో వాదనకు దిగాను. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి.. ఎవరు దోషులు తేల్చండి అని సవాల్ చేశాను.. అప్పుడు సీఎం ఆశ్చర్యకరంగా మాట్లాడారు. అవినాష్ పై అనుమానంతో సిబిఐ విచారణ అడుగుతున్నావ్… అవినాష్ వైసీపీ వదిలి బీజేపీ లో చేరిపోతాడు.. అంతకు మించి ఏమీ కాదు.. ఒకవేళ కేసు అయినా.. పన్నెండోది అవుతుంది( జగన్ పై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి) అని వ్యాఖ్యానించారు. పారదర్శక విచారణ కోసం ఆ తర్వాత పలు దఫాలుగా వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సీబీఐ విచారణ అడగాలని సిఎంను కోరాను. సీబీఐ విచారణకు నేను కోర్టును ఆశ్రయిస్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు.

కానీ మా నాన్న హంతకులకు శిక్ష పడాలి అంటే నాకు వేరే గత్యంతరం లేకుండా పోయింది. నాకు తెలిసి నాన్న రూ. 104 కోట్ల కోట్ల వ్యవహారం ఏదో భరత్ యాదవ్, సునీల్ యాదవ్ తో కలిసి సెటిల్ చేశారు. నాన్నకు అందులో నాలుగు కోట్లు వచ్చాయని తెలిసింది. అందులో వాటా ఇవ్వాలని భరత్, సునీల్ డిమాండ్ చేశారు. నాది ప్రధాన పాత్ర కథ.. కోటిన్నరకు ఎక్కువ మీకు ఇవ్వనని నాన్న బదులిచ్చారు. భరత్ కు కోటి రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. కదిరి లో కొంత తీర్చడానికి తెలిసింది.

సునీల్ కుటుంబంలో ఓ మహిళతో భరత్ యాదవ్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీరందరూ కలిసి ఉంటారు. దస్తగిరికి తెలుసు ఎవరు చంపారు చంపారో..వేకువజామున అక్కడే ఉన్నాడు. మా నాన్న, పెదనాన్న కు కుమ్మడి ఆస్తి 600 ఎకరాలు ఉండేది. మా ముగ్గురికి ( జగన్, షర్మిల, సునీత) సమానంగా 200 ఎకరాల చొప్పున పెంచారు. తర్వాత ఎకరం లక్ష చొప్పున నుంచి వెనక్కి తీసుకున్నారు. ఆస్తి కోసంఅవినాష్ వాళ్ళతో నా భర్త కుమ్మక్కయి నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే ఆస్తి మొత్తానికి నేనే వారసురాలిని. ఆయనకు సంబంధం లేదు.

Related posts