భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఫైనల్ శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉన్న వర్షం కారణంగా తొలి రోజు ఆట టాస్ పడకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గరయ్యారు. తొలిరోజు ఆట వర్షార్పణం కావడంతో రెండోరోజు ఆటైనా సవ్యంగా సాగుతుందో లేదోనన్న అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. కానీ వరుణుడు శాంతించాడు. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో ఎండ కొడుతుందని క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌతాంప్టన్‌లోనే ఉన్న డీకే.. మైదానం ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ‘సూర్యుడు నిద్ర లేచాడు’అని తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఫొటో ప్రకారం మైదానంలోని కవర్లను అయితే తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం. శుక్రవారంతో పోలిస్తే శనివారం వాతావరణం మెరుగ్గా ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ కూడా పేర్కొంది.
previous post
next post