telugu navyamedia
వార్తలు సాంకేతిక

అమెరికా సదస్సులోవంగూరి చిట్టెన్ రాజుకు ‘మహా పురస్కారం ‘

ఈనెల 21, 22, తేదీలలో అమెరికాలోని కాలిఫోర్నియా జరిగిన లో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో వంగూరి చిట్టెన్ రాజు గారిని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు కనకాంబర పుష్పభిషేకంతో వారిని వేదిక మీదకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తరుపున “మహా పురస్కారం” మొట్ట మొదటిసారి వంగూరి చిట్టెన్ రాజు గారికి ప్రదానంచేస్తున్నట్టు ప్రకటించారు . తెలుగు సాహిత్యానికి , సాంస్కృతికి చిట్టెన్ రాజు గారు చేస్తున్న సేవలను గుర్తుంచి వారిని “బంగారు ఏనుగు” తో ఘనం గా సత్కరించారు

మిల్పిటస్ నగరం, (కాలిఫోర్నియా) లో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ద్గ్విజయంగా జరిగింది. అమెరికాలో అన్ని నగరాలనుంచీ, కెనడాలో టొరంటో, ఆటవా, వాంకూవర్ నగరాల నుంచీ, అటు భారత దేశం నుంచీ సుమారు 150 మంది సాహితీవేత్తలు ఈ రెండు రోజుల సాహిత్య సమావేశం లో పాల్గొని తమ ప్రసంగాలని వినిపించారు. ముందు రోజు..అనగా శుక్రవారం, అక్టోబర్ 20 నాటికి మిల్పిటస్ చేరుకున్న సాహితీవేత్తలని సాదరంగా విమానాశ్రయం లో స్వాగతం పలికి, సభా ప్రాంగణం అయిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో విందు భోజననాలు ఏర్పాటు తో పాటు మారియట్ హొటెల్ కి వసతి సౌకర్యాలు కల్పించారు .

అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అల్పాహారం అనంతరం అక్టోబర్ 21 ఉదయం 9:00 గంటలకి ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాజు చమర్తి గారి స్వాగత వచనాలతో ప్రారంభం అయింది. ప్రారంభ వేదిక నిర్వాహకులు శాయి రాచకొండ ప్రధాన అతిధులని వేదిక మీదకి ఆహ్వానించారు. భారత దెశం నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చెసిన ఆచార్య సి. మృణాళిని. గంటి శ్రీదేవి (సదస్సు కార్యదర్శి), లక్ష్మి రాయవరపు (సదస్సు నిర్వాహకురాలు) జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీమతి రేఖ కూచిభొట్ల ప్రార్ధన గీతాలాపనతో సదస్సు ప్రారంభం అయింది. సదస్సు లో తొలి అంశంగా స్థానిక “మన బడి” లో బాలబాలికలకి స్వచ్చందంగా తెలుగు నేర్పుతున్న 22 మంది ఉపాధ్యాయులని శాలువాల సత్కరించారు. ‘విశ్వదాత” సిలికానంధ్రా వారికి సార్వభౌమ పోషకులు, ఆయన పేరిటే ఉన్న ఆ ప్రాంగణం లో జరుగుతున్న ఈ సదస్సుకు సభాధ్యక్షులుగా వ్యవహరించిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారి ఆత్మీయ స్వాగత వచనాలతో తమ శుభాకాంక్షలు తెలిపారు. ‘పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రారంభోపోన్యాసం చేస్తూ అమెరికాలో తెలుగు భాషా, సాహిత్యాల వ్యాప్తికి కృషి చెస్తున్న సంస్థలని అభినందించారు. ప్రధానోపన్యాసం చేసిన “పద్మశ్రీ” ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఈ సదస్సు తనకి ఒక వినూత్నమైన ఉన్నత స్థాయి అనుభూతిని కలిగిస్తున్నది అని అభివర్ణించారు. తరువాత అమెరికా తెలుగు సాహితీ సదస్సులు నేపధ్యం గురించి వంగూరి చిట్టెన్ రాజు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సేవల గురించి కూచిభొట్ల ఆనంద్. తెలుగు విభాగం ప్రధానోపాధ్యాయులు ఆచార్య మృణాళిని క్లుప్తంగా ప్రసంగించారు. తరువాత తాటిపాముల మృత్యుంజయుడు ప్రధాన సంపాదకులుగా ఈ 13వ అమెరికా సాహితీ సదస్సు సభా విశేష సంచికని ఆచార్య యార్లగడ్డ వారు అవిష్కరించారు. ఆ సంచిక వ్యాస సేకరణలో కిరణ్ సింహాద్రి సహకరించారు.

తరువాత సాహిత్య అకాడమీ (ఢిల్లీ) వారు ప్రచురించిన “అర్ధ శతాబ్దిలో అమెరికా కథ” గ్రంధాన్ని ఆచార్య ఇనాక్ గారు ఆవిష్కరించి తొలి ప్రతిని ఆచార్య యార్లగడ్డ గారికి అందజేశారు. తెలుగు ఐదారు వందల సంవత్సరాల క్రితమే వలస కూలీలుగా ఇతర దెశాలకు వలస వెళ్ళినా, కేవలం అమెరికా కి వలస వచ్చిన మేధావులు తమ డయాస్పోరా అనుభవాలని కథల రూపం లో నిక్షేపించ గలిగారు అనీ, ఆ తొలి తరాల 50 సంవత్సరాలలో వచ్చిన 50 కథలని ఎంపిక చేసే అవకాశం ప్రధాన సంపాదకులుగా తనకీ, ఆ గ్రంధ నామకరణం చేసిన సహ సంపాదకురాలు డా. మృణాళిని గారికీ దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు వంగూరి చిట్టెన్ రాజు ప్రకటించారు. విదేశాలలో ఉన్న వారి రచనలని ప్రచురించడం సాహిత్య ఎకాదెమీ చరిత్రలో ఇదే మొదటి సారి అనీ అందుకు ఎకాదెమీ ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస రావు గారిని అభినందిస్తూ, ఆ 50 మంది కథకులలో ఈ నాటి సదస్సులో పాల్గొంటున్న 12 మంది కథా రచయితలని వేదిక మీదకి ఆహ్వానించి ఆ గ్రంధం ప్రతులు వారికి అందజేయడం అందరి ప్రశంసలనీ అందుకుంది. ప్రారంభ సభలో ఆఖరి అంశంగా మృణాళిని గారు రచించిన ఒక కథని సగం కత్తిరించి, ఆ కథని పూర్తి చేసే కథా పూరణ పోటీ వివరాలని శాయి రాచకొండ ప్రకటించారు. అలనాటి “పడమట సంధ్యారాగం” సినీ నిర్మాత, నటుడు మీర్ అబ్దుల్లా తమ తదుపరి సినిమాలో కథ, హాస్య సన్నివేశాల కి కొత్త ఆలోచనలని ఆహ్వానిస్తూ అమెరికా కథకులకి అ వివరాలు తెలియజేశారు.

సుమారు గంట సేపు జరిగిన ప్రారంభ సభ తర్వాత రెండు రోజుల లోనూ 8 ప్రసంగ వేదికలు జరిగాయి. ఆయా ప్రసంగాలలో సభికులను విశేషంగా ఆకట్టుకున్న కొందరు వక్తలలో కె.వి.బి శాస్త్రి, ముత్తేవి రవీంద్రనాథ్, వేమూరి వెంకటేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, సత్యం మందపాటి, ప్రభల జానకి, దేశికాచారి, నవీన చంద్ర, జి.వి. ప్రభాకర్, సూర్యకుమారి ఉపాధ్యాయుల, రాధిక నోరి, కొండపల్లి నీహారిణి, శ్యామల దశిక, భాస్కర్ పులికల్, గీతావాణి, లక్ష్మి గోపరాజు, శరత్ చంద్రిక, శాంతి కూచిభొట్ల, బీరం సుందర రావు, ఫణి డొక్కా, భాస్కర్ రెడ్డి నందనూరు, వసీరా, ఉమా భారతి కోసూరి, మాధురి ఇంగువ, బండకాటి అంజయ్య గౌడ్, లలితా రామ్, కె.గీత, వేణు నక్షత్రం, వెంకట్ నాగం, మణి మల్లవరపు, జి.ఎస్.ఎస్. కల్యాణి, భాస్కర్ రాయవరం, అపర్ణ గునుపూడి, కె.వి. రమణా రావు, కొండా వెంకట్, వి. మల్ల్లికార్జున్, ఆళ్ళ శ్రీనివాస రెడ్డి తదితరులు. ఆలూరి బైరాగి కవిత్వం మీద సాధికారికంగా ఆచార్య యార్లగడ్డ ప్రసంగం, సాహిత్యమూ, సమాజమూ పరస్పర ప్రభావాల మీద ఎంతో అనుభవంతో కూడిన ఆచార్య ఇనాక్ గారి ప్రసంగమూ సదస్సులో తలమానికంగా నిలిచాయి. అలాగే లలితా త్రిపుర సుందరి, వేదుల సుభద్ర ల “యుగళ కథా విశ్లేషణ” లో అలనాటి మార్గదర్శి, ధనలక్ష్మి కథల విశ్లెషణ సభికుల ప్రత్యేక ప్రశంసలని పొందింది. ఊరిమిండి నరసింహా రెడ్డి మొదటి రోజు నిర్వహించిన “మన సిరి సంపదలు”, శారద కాశీవఝ్ఝుల రెండవ రోజు నిర్వహించిన “ప్రహేళిక” కార్యక్రమాలలో సభికులు ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. ఆయా వేదికలని లక్ష్మి రాయవరపు, భాస్కర్ రాయవరం, మణి మల్లవరపు, కె. గీతా మాధవి, రాధిక నోరి, వేణు నక్షత్రం సమర్ధవంతంగా నిర్వహించారు.

మొదటి రోజు కార్యక్రమానికి పరాకాష్టగా ప్రముఖ సాహితీవేత్తలు కిరణ్ ప్రభ , కాంతి దంపతులకి జీవన సాఫల్య పురస్కార ప్రదాన సభ
ఇక మొదటి రోజు సాయంత్రం విందు భోజనం నభూతో న భవిష్యత్ అనే అభిప్రాయం సర్వత్రా వినపడింది. అరిటాకులలో సంప్రదాయ బధ్ధంగా, ఆ ప్రాంగణం లోనే వండిన అన్ని వంటకాలని వేడి వేడిగా కూచిభొట్ల ఆనంద్ & శాంతి దంపతులు, రాజు చమర్తి, దిలీప్ కొండిపర్తి, శ్రీదేవి గంటి మొదలైన అనేక మంది సిలికానంధ్ర బృంద సభ్యులు ఆప్యాయంగా, కొసరి కొసరి వడ్డించి సాహితీ విందుకి సరితూగే రుచికరమైన వింధు భోజనాలని అందించడం అందరికీ ఎన్నడూ లేని అనుభూతిని కలిగించింది. విందు సమయంలో ప్రముఖ సంగీత విద్వాంసులు జి.వి. ప్రభాకర్ తన గానామృతం తోటీ, బహుముఖ ప్రజ్ఞాశాలి ఫణి డొక్కా మిమిక్రీ తోటీ సభికులని అలరించారు.
రెండవ రోజు, అక్టోబర్ 22, సాయంత్రం సుమారు 5:00 గంటల దాకా జరిగిన ప్రసంగ వేదికల తర్వాత సదస్సు ప్రధాన నిర్వాహక సంస్థలైన సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు ముగింపు సభ నిర్వహించారు. అందులో సదస్సు లో పాల్గొన్న ప్రతినిధుల వ్యక్తిగత అనుభూతులు, అమెరికాలో తెలుగు సాహిత్య పురోగతికి సదస్సు సాధించిన ప్రగతి మీద సభికులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇక ముందు జరిగే సదస్సుల కొసం సూచనలు చేశారు.

డయాస్పోరా కథానిక-17, అమెరికాకర కాయ కథలు (వంగూరి చిట్టెన్ రాజు) మా ఊరి కథలు (ఓరుగంటి ప్రసాద్), ఏడు సంక్షిప్త భౌతిక శాస్త్ర వ్యాసాలు (పెమ్మరాజు శ్రీరామారావు), “వర్షం కురిసిన సముద్రం & ఎక్కవలసిన రైలు (సత్యం మందపాటి), ‘సుధీ శతకం” (బండకాటి అంజయ్య), నవ వ్యాస మాలిక (లలితా రామ్), దైనందిన జీవితానికి భగవద్గీత” (కాకర్ల సత్యవాణి), హరి కథా సింధువు (ప్రభల జానకి), సంగీత లక్షణ గ్రంధాలు (శారదా పూర్ణ శొంఠి), తెనాలి రామకృష్ణ కవి & కరణీకం (ముత్తేవి రవీంద్రనాథ్), చిత్ర పద బంధ కవిత్వం (మాతా శాంకరీ దేవి), ఘర్షణ (కొండపల్లి నీహారిణి) మొదలైన గ్రంధాలు ఆవిష్కరించబడిన రెండు పుస్తకావిష్కరణ వేదికలని పాణిని జన్నాభట్ల కార్య దక్షతతో సమర్ధవంతంగా నిర్వహించారు. విజయ సారధి జీడిగుంట గ్రంధావిష్కరణ ప్రణాళికలో ముఖ్య పాత్ర వహించారు.
ముందు రోజు ప్రకటించిన కథా పూరణ పోటీలో విజేతలు అయిన సుభద్ర వేదుల, షర్మిల, భాస్కర్ రాయవరం లను మృణాళిని గారు ప్రకటించి అభినందించగా వంగూరి చిట్టెన్ రాజు వారిని నగదు బహుమతితో సత్కరించారు.

అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా జరగడానికి కారకులైన వక్తలు, ప్రతినిధులూ, సదస్సు ప్రణాళిక రూప కల్పన చేసిన వంగూరి చిట్టెన్ రాజు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అత్యంత శోభాయమానంగా ఏర్పాట్లు చేసిన కూచిభొట్ల ఆనంద్, మొత్తం సదస్సు నిర్వహణ ఎంతో సమర్ధవంతంగా చేసిన శాయి రాచకొండ, లక్ష్మి రాయవరపు, రాజు చమర్తి, శ్రీదేవి గంటి, దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శిరీష చమర్తి మొదలైన అనేక మందిని అభినందించారు .

Related posts