telugu navyamedia
క్రీడలు వార్తలు

వరుణుడి కారణంగా భారత జట్టులో మార్పులు…?

డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకుంది. అయితే శుక్రవారం మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సౌథాంప్టన్‌లో వర్షం కురవడంతో తొలిరోజు ఆటలోని మొదటి, రెండో సెషన్‌లు టాస్‌ కూడా పడకుండానే రద్దయ్యాయి. వర్షం ఆగి టాస్‌ వేసే సమయానికి భారత్‌ గురువారం ప్రకటించిన జట్టులో మార్పులు చేయొచ్చని టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ సునీల్‌ గవాస్కర్ అంటున్నారు. వర్షం కారణంగా భారత్ తుది జట్టులో ఒక స్పిన్నర్‌ను తొలగించి.. అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసే వీలుందని సునీల్‌ గవాస్కర్ అంచనా వేశారు. సన్నీ చెప్పింది నిజమయితే.. హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి అదనపు బ్యాట్స్‌మన్‌గా ఎంపికకానున్నాడు. గురువారం ప్రకటించిన జట్టులో విహారికి చోటు దక్కలేదు. ఆరో స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దక్కగా.. ఇద్దరు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు అవకాశం దక్కింది. సన్నీ చెప్పినట్టు అదనపు బ్యాట్స్‌మన్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకోవాలని భావిస్తే.. విహరికే అవకాశం రానుంది.

Related posts