తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ లబ్దిదారులకు దృవీకరణ పత్రాలు ఆదివారం పంపిణీ చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లాలోని చింతకుంటకు చెందిన భూక్యా భాగ్యమ్మ(50) ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
జిల్లాలోని చింతకుంటలో ఆసరా లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేసి వెళుతున్న సమయంలో అక్కడే ఉన్న భాగ్యమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకొంది. వెంటనే టీఆర్‌ఎస్ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. తనకు ఇంటి నెంబర్ కేటాయించేందుకు సర్పంచ్, కార్యదర్శి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని భాగ్యమ్మ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం భాగ్యమ్మ విలేకరులతో మాట్లాడుతూ 2007 నుంచి ఇంటి నెంబరు కోసం ప్రయత్నిస్తే రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.