ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిలాల్లో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఆజాద్ నగర్‌కి చెందిన జ్యోతి అపహరణకు గురైంది. కారులో వచ్చిన దుండగులు యువతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆజాద్ నగర్ ఆరో రోడ్డుకి చెందిన కార్పెంటర్ కూతురుకి కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన భగీరథతో గతంలో వివాహం నిశ్చయించారు. అతను అవుకు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహం రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం యువతి మరో మహిళతో కలసి టైలర్ వద్దకు బయలుదేరింది.
అయితే ఆ సమయంలో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ కనుగొనేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యులు చేపట్టాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా కారును గుర్తించి సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు స్థానికి పోలీసులు.