భక్తుడన్నాక దేవుడికి ఏదో ఒకటి నివేదన చేస్తుండటం సహజం. అయితే అది దాదాపుగా సాత్విక ఆహారం మాత్రమే అయిఉంటుంది. కానీ ఎక్కడో కొన్ని చోట్ల గొర్రెలు, కోళ్లు, తదితర ప్రాణుల బలి కూడా ఇస్తుంటారు. ఆయా దేవతా మూర్తిని, అలాగే అక్కడి ప్రజల విశ్వాసాన్ని బట్టి ఈ నివేదనలు ఉంటాయన్నది స్పష్టమైన నిజం. అలాగే కాస్త విచిత్రంగా, కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని భాగ్యనగర్ గ్రామంలో గణేశుడికి మద్యం, మాంసం నివేదనగా పెడుతుంటారు. ఇలాంటివి వినడానికి ఇతరులకు విచిత్రంగా ఉన్నా, అక్కడి ప్రాంత ప్రజలకు మాత్రం సహజమైన దైనందిన కార్యక్రమమే.
ఇక్కడి క్షత్రియ వర్గానికి చెందిన భక్తులు గనేశుడికి విస్కీ, కోడి మాంసం నివేదనగా పెడుతూండటం అదికూడా మూడవరోజైన గణేష్ చతుర్థి నాడే పెడుతూండటం ఒక ఆచారం. ఈ సాంప్రదాయం దాదాపుగా 100 క్షత్రియ కుటుంబాలు పాటిస్తున్నారు. ఈ తరహా నివేదన చేయటంతోనే తమకు గణేశుడు ధనాన్ని, ఆనందాన్ని ఇస్తారని అక్కడి గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళు ఏళ్లతరబడి అదే తరహా నివేదన చేస్తూనే ఉన్నారు.
అవి కాకుండా గణేశునికి శాఖాహార నివేదన పెడితే ఆయన తృప్తి పడరని అక్కడి వారు (ఈ ఆచారంపై ప్రశ్నించగా) చెప్పడం విశేషం. తాము నివేదించే మాంసాహారం, విస్కీ తో పాటుగా అందరూ సహజంగా సమర్పించే పాలు, కొబ్బరినీళ్లు కూడా గణేశునికి నివేదిస్తామని వారు చెపుతున్నారు. పండుగ సందర్భాలలో ఒక విస్కీ బాటిల్ గణేశునికి నివేదిస్తారు, ఒక్కోసారి దానిని విగ్రహంపై చల్లడం కూడా జరుగుతుంటుందట..అది కూడా నివేదనలో ఒక భాగమే.
నిజానికి భక్తితో ఏది ఇచ్చినా పుచేసుకుంటాడు భగవంతుడు.. నీకు ఉన్నది ఆయనకు సమర్పించి తీసుకుంటే, ఆయనకు కలిగే ఆనందమే వేరు. ఇది శాస్త్రం చెపుతుంది. అసలైతే నీకు ఉన్నది ఇచ్చింది కూడా ఆయనే, కానీ ఆయన ఇచ్చింది కృతజ్ఞతతో మళ్ళీ ఆయనకు సమర్పించి నీవు తీసుకుంటే దేవుడికి ప్రీతి కలుగుతుందని శాస్త్ర వాక్యం. నివేదించింది ఏదనేది ముఖ్యం కాదు, అది ఎంత ప్రేమతో ఇచ్చారనేదే దేవుడు చూస్తాడనేది కూడా శాస్త్రం స్పష్టంగా చెపుతుంది.