telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ ‌లో 30 స్థానాలకు, అస్సాంలో 39 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగనుంది. పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా…
రెండు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. బెంగాల్‌లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుండగా… మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 75,94,549 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్‌ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉండనుంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీజేపీ అగ్ర నేతలు. మమతకు పోటీగా ఒకప్పటి ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారి బీజేపీ తరపున పోటీ చేయనున్నారు.
అస్సాం రెండో విడత ఎన్నికలు
అస్సాంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్‌ 6 స్థానాల్లో, యూపీపీఎల్‌ 3 సీట్లలో పోటీ. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్‌ మధ్య స్నేహపూర్వక పోటీ జరుగనుంది. మహాకూటమి నుంచి కాంగ్రెస్‌ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్‌ 7 స్థానాల్లో, బీపీఎఫ్‌ 4 స్థానాల్లో పోటీ ఉండనుండగా.. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్‌ 19 స్థానాల్లో పోటీ చేయనుంది. 25 స్థానాల్లో ఎన్.డి.ఏ, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ చేస్తుండగా.. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌ పోటీ చేయనున్నారు.

Related posts