telugu navyamedia
సినిమా వార్తలు

సొమ్ము నిర్మాతది సోకు ప్రభుత్వానిదా ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఇక నుంచి ఆన్లైన్ లోనే విక్రయించాలని , ఇందుకు ప్రభుత్వమే ఒక వెబ్ సైట్ ను ప్రారంభిస్తుందని , సినిమాకు సంబంధించి అన్ని కార్యకలాపాలు చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించి, అందుకు జి .వో .ఎమ్మెస్ నెంబర్ 35, తేదీ 31ఆగష్టు 2021తో ఉత్తర్వు ను కూడా తీసుకొచ్చింది .

ఈ వార్త తెలుగు  సినిమా రంగంలో బాంబు పడ్డంత కలవరం సృష్టించింది .
ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాలు విడుదల చెయ్యడానికి పెద్ద నిర్మాతలు సాహసించడం లేదు . తప్పనిసరైతే ఓ .టి .టి కి వెడుతున్నారు . పెద్ద బడ్జెట్ తో నిర్మించిన సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు . మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి తరువాత తప్పకుండా టికెట్ రేట్లు పెరుగుతాయనే ఆశాభావంతో వున్నారు . ఇప్పుడు వీళ్ళ ఆశలను తాజా ఉత్తర్వు వమ్ముచేసింది .

 

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే విడుదల అవుతున్నాయి . వాటికి కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. కారణం ప్రభుత్వ నియమ నిబంధనలే కారణం .
ఇంతకాలం సినిమా పరిశ్రమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని అందరూ అనుకున్నారు తప్ప కొత్త సమస్యలుసృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు .

Sri Reddy, Jr. NTR, Samantha Akkineni, Nagarjuna and Rana Daggubati – Meet  the top 5 news-makers of the week - tollywood

ఎందుకిలా జరిగింది ? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సన్నిహితంగా వుండే చిరంజీవికి కూడా తెలియకుండా ఉత్తర్వు వెలువరించడం వెనుక ఆంతర్యం ఏమిటి ? తెలుగు సినిమాను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి ఎందుకు తీసుకున్నారు ?

ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా రైల్వే టిక్కెట్లు ఎలా బుక్ చేసుకుంటామో , అలాగే ఇకముందు ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని సినిమా హాళ్ల లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి . ఇందుకోసం ఓ పోర్టల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Andhra Pradesh: YS Jagan announces Rs. 30 lakh ex-gratia to kin of deceased  in Chhatisgarh encounter

హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన,. వివిధ శాఖల నుంచి ఏడుగురు సభ్యులను నియమించారు. సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరిని కూడా ఈ కమిటీలో ఎంపిక చెయ్యలేదు. ఈ విధానం అమలులోకి వస్తే టిక్కెట్ రేట్లు నిర్ణయించడం , విక్రయించడం పూర్తిగా ప్రభుత్వంచేతుల్లోనే ఉంటుంది. నిర్మాతలు సినిమా తీసివిడుదల చేసుకోవడం మాత్రమేవీరి చేతుల్లో ఉంటుంది. తరువాత కథ అంతా ప్రభుత్వమే నడిపిస్తుంది .సినిమా టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చే డబ్బంతా ప్రభుత్వానికి చేరిపోతుంది .

ఈ పరిస్థితికి , పరిణామానికి కారణం నిర్మాతలే అని తెలుస్తోంది . జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక విడుదలైన సినిమాల జి .ఎస్ .టి సక్రమంగా ప్రభుత్వానికి జమకాలేదని , తప్పుడు లెక్కలు చూపించి జి .ఎస్ .టి కట్టడం లేదని తెలుసుకున్నారు . ఇక కొత్త సినిమాలు విడుదల సమయంలో టికెట్ రేట్లను పెంచి నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు . తమ సినిమా ఇన్ని కోట్లు వాసులు చేసిందని గొప్పగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు .

అలా వచ్చిన డబ్బుకు జి .ఎస్ .టి కట్టడం లేదని ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెచ్చారని, . అసలే సినిమా వారంటే గుర్రుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదాయం మొత్తం ప్రభుత్వానికి చేరేలా ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , అందుకే ఎవరికీ తెలియకుండా తాజా ఉత్తర్వు వచ్చిందని తెలుస్తుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్ లలో టికెట్ రేట్లను కూడా స్వల్పగా పెంచుతారని , దానికి సంబందించిన ఉత్తర్వు కూడా త్వరలో రావచ్చని అంటున్నారు .

తనకి మద్దతు ఇచ్చింది ఇద్దరో ముగ్గురో తప్ప సినిమావారి నుంచి ఎలాంటి ప్రోత్సాహం , సహకారం లేదని , కాబట్టి సినిమా వారిని పూర్తిగా తమ కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది .

Jagan to nominate Chiru to Rajya Sabha?

అసలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటున్నది . ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి తదితరులు కలసి చర్చించినా ఆశించిన ఫలితాలు ఉండక పోవచ్చని అంటున్నారు . ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి సినిమాకు ఎంతో చేస్తాడని నమ్ముతున్న పెద్ద సినిమా నిర్మాతల పరిస్థితి ఊహించలేం ?

తెలుగు సినిమారంగ ప్రముఖులు ఎలా స్పందిస్తారో ?
– భగీరథ

Related posts