telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డెంగీ సీజన్ వచ్చేసింది.. అన్ని జ్వరాలు ఒకటి కాదు.. అప్రమత్తత అవసరం..

viral fevers in visakha manyam areaviral fevers in visakha manyam area

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డెంగీ వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందవద్దని అన్నారు. వైరల్ జ్వరాలే అధికంగా ఉన్నాయని, వాటిని డెంగీ జ్వరంగా భావించి ప్రజలు భయపడుతున్నారన్నారు. గతంలో పోలిస్తే ఫీవర్ దవాఖానలో సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఓపీ కౌంటర్ల సంఖ్య ను 6 నుంచి 25కు పెంచడం జరిగిందన్నారు. నల్లకుంటలోని ఫీవర్ దవాఖానకు జ్వర పీడితులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అక్కడి పరిస్థితులు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేశ్, డీఎంఈ రమేశ్‌రెడ్డిలతో కలిసి దవాఖానను సందర్శించారు.

ఈ సందర్భంగా జ్వరాలకు సంబంధించిన రెండు, మూడో వార్డులకు వెళ్లి ఇన్‌పేషంట్లను దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులను ఆరా తీశారు. సరైన వైద్యం అందిస్తున్నారా ? మందులు ఇస్తున్నారా? అనేది పరిశీలించారు. వైద్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయనేది కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వైరల్ జ్వరాల గురించి అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తమకు కూడా ప్రతి దవాఖాన నుంచి నివేదికలు అందుతున్నాయని, వాటిని సీఎంకి సమర్పిస్తున్నామని తెలిపారు.

జూన్‌లో 25వేల మంది రోగులు ఫీవర్ దవాఖానకు చికిత్స(ఓపీ) నిమిత్తం వస్తే అందులో 9 మాత్రమే డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, జూలై, ఆగస్టు నెలల్లో 51వేల మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తే అందులో 61 కేసులు మాత్రమే డెంగీ కేసులుగా నమోదయ్యాయన్నారు. అంతా డెంగీ అని భయపడుతున్నారని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. అయితే 751 కేసులు వైరల్ ఫీవర్‌గా నమోదయ్యాయని వెల్లడించారు. దీని పేరే ఫీవర్ దవాఖాన అయినందుకు జ్వరాలతో వచ్చే వారే అధికంగా ఉంటారన్నారు. ప్రస్తుతం ప్రతి నిత్యం 2వేల నుంచి 4వేల మధ్య ఓపీ నమోదవుతున్నదని, రద్దీకనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రోగుల రద్దీ దృష్ట్యా ఫీవర్ దవాఖానలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీ చూస్తున్నారన్నారు.

ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉదయం సమయాల్లో సైతం దోమ తెరను ఉపయోగించాలని కోరారు. ప్రధానంగా వరదలు వచ్చినా డాక్టర్లు ఏజెన్నీ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేస్తున్నారన్నారు. సీజన్ మారినందువల్ల అందరూ జ్వరాల బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ కాచిన నీటినే తాగాలని సూచించారు. ల్యాబ్‌ల్లో పరీక్షలు త్వరగా చేసి వెంటనే రిపోర్టులు ఇవ్వాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అవసరమైన ఇండెంట్ పెట్టాలని, తీవ్ర జ్వరంతో బాధపడే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకొని చికిత్స అందజేయాలని, టెస్ట్‌లు అవసరమైన వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీ పెరిగినా సంబంధిత రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దవాఖానలో చేపట్టిన చర్యలను సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్‌కు వివరించారు.

Related posts