telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీసీఎం జగన్ నిర్ణయాన్ని … ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాము .. : టీజీ వెంకటేష్

TG Venkatesh MP

ఏపీ శాసనసభ సమావేశాలలో రాజధాని అంశం పై జరిగిన సుదీర్ఘ చర్చలో ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందని ప్రకటించారు. టిడిపి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తే, బిజెపి మాత్రం స్వాగతించింది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలి అని, మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావచ్చు అని సీఎం జగన్ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అందిన వెంటనే రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే అందుకు అనుకూలంగా కావలసినవన్నీ ఉన్నాయని, ఒక మెట్రో రైలు వస్తే సరిపోతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునేమోనని ఏది ఏమైనా నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను ముఖ్యంగా ఎంతో కాలంగా రాయలసీమ కోసం పోరాటం సాగిస్తున్న బిజెపి ఎంపీ టీజి వెంకటేష్ స్వాగతించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు మాత్రమే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉంటే బాగుంటుంది అన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు.

Related posts