మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్నిరోజులుగా వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ వంశీకులు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అడ్డుకుంటామని ఆందోళనలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. సైరా చిత్రీకరణ సమయంలో తమకు చిరంజీవి, చరణ్‌లు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వారు ఆరోపణలు చేశారు. ఈ వివాదం అనేక మలుపులు తీసుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులను ఎవరో ఉసిగొల్పారని, వారు 23 కుటుంబాల వారు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు కోట్లు చొప్పున డిమాండ్ చేశారని చిరంజీవి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే దీనిపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు స్పందించారు. చిరంజీవి చెప్పినట్లు తమ వంశీకులు ఒక్కొక్క కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు చెల్లించమని అడగలేదని, ఆయన అబద్ధం చెబుతున్నారని అన్నారు. అయితే చరణ్ ఇది వరకు చెప్పినట్లు తాము ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు అడిగామని తెలిపారు. సినిమా విడుదల సందర్భంగా తాము సినిమాకు సంబంధించి వేసిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.
previous post
వందలసార్లు పచ్చి బూతులు తిడుతున్నారు… సింగర్ చిన్మయి శ్రీపాద