telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబు సభలకు, సమావేశాలకు వెళ్లేవారు కాదు… ఎందుకంటే…?

Sobhan-Babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఈరోజు శోభన్ బాబు సభలకు, సమావేశాలకు ఎందుకు హాజరయ్యేవారు కాదో తెలుసుకుందాము.

1996 జనవరి 1 నుంచి శోభన్ బాబు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. వెండితెర జీవితానికి తెర దించి, సినిమాలకు, మేకప్ కు గుడ్ బై చెప్పేశారు. అప్పట్నుంచి ఆయన వ్యక్తిగత జీవితానికి, ఆయన కుటుంబానికే పరిమితం అయిపోయారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు దశలు దాటాలని శోభన్ బాబుకు హిందీ మాష్టారు చెబుతుండేవారు. బ్రహ్మచర్యంలో బుద్ధిగా చదువుకోవాలి. తరువాత పెళ్ళి చేసుకుని గృహస్థుడై పిల్లల్ని కని, వారిని పోషిస్తూ వృత్తి జీవితాన్ని గడపాలి. అరవై ఏళ్ళు వచ్చేసరికి వారికీ పెళ్లిళ్లు చేసి, అన్ని కార్యకలాపాలకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకోవాలి. వీలైతే వనాలకు వెళ్ళిపోవాలి. ఆపై సన్యాసం.

Sobhan-Babu2

శోభన్ బాబు సినిమాలకు దూరమయ్యాక ఇంతవరకు షూటింగుల్లో బిజీగా ఉండి పబ్లిక్ ఫంక్షన్స్ కు, బంధువుల పెళ్ళిళ్ళకు వెళ్లలేకపోయావు కదా… కాబట్టి ఇప్పుడైనా సభలకు, సమావేశాలకు, పెళ్ళిళ్ళకు వెళ్ళమని ఆత్మీయులు ఆయనకు సలహా ఇస్తుండేవారు. అయితే శోభన్ బాబు ఆలోచన మాత్రం వేరుగా ఉండేది. ఆయన సినిమాలు మానేసిందే విశ్రాంతి కోసం కదా… ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్లు, సభలు, సమావేశాలు, పుస్తకావిష్కరణలు అంటే సినిమాలు వదిలివేయడంలో అర్థం ఏముంటుంది ? పైగా ఏదైనా పుస్తక ఆవిష్కరణకో, సభకో వెళితే ఉపన్యాసాలతో ఊదరగొట్టాలి. అది ఎలాంటి సభ అయినా కూడా మొహమాటం కోసమైనా వేదికనెక్కి వారిని పొగడాలి. అనవసర అతిశయోక్తులు, అబద్ధాలు చెప్పాలి. అంతేకాదు గతానికి, ఇప్పటికి పోలిక పెడుతూ మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి అంటూ ఫోజులు కొట్టాలి. ఇదంతా అవసరమా ?

పైగా ఫంక్షన్లకు పిలిచేడి కూడా అభిమానంతో కాదు ఫేస్ వాల్యూ చూసి… అంటే అప్పటి వరకూ సోగ్గాడిగా చూసిన తనను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు కదా అని ప్రజలు వస్తారు. తరువాత ఆటో గ్రాఫ్ లు… ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఏ ఫంక్షన్ కు పడితే ఆ ఫంక్షన్ కు వెళ్లడం వల్ల చూసే జనాలకు విసుగొచ్చి ఫేస్ వాల్యూ తగ్గుతుంది. ఇలా జరిగిన తరువాత సభలకు కూడా ఎవ్వరూ పిలవరు. అయినా రిటైర్ అయ్యింది ఎందుకు ? ప్రశాంతత కోసం కదా… ఇవన్నీ జరిగితే ప్రశాంతత ఎక్కడుంటుంది ? దీనికన్నా తండ్రి, తాత, ముత్తాత పాత్రలు వేసుకుంటే సరిపోతుంది కదా… ఇలా సాగేవి శోభన్ బాబు ఆలోచనలు. అందుకే సినిమాలకు, పత్రికలకు, సభలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని బలంగా అనుకున్నారు శోభన్ బాబు.

Sobhanbabu Awards 2018 images

2001లో శోభన్ బాబు మౌంట్ రోడ్ లో తనకు బాగా కావాల్సిన వారి అమ్మాయి పెళ్ళికి వెళ్లారు. అక్కడ శోభన్ బాబును చూసిన ఒకావిడ “ముసలివారై పోతున్నారు” అంది. అంతే… ఇక బయటకు రాకూడదని శోభన్ బాబు అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పటికే అందమైన సోగ్గాడిగా అందరికీ తెలిసిన శోభన్ బాబు… ఇప్పుడు ఏడు పదుల వయసులో ముడతలు పడిన శరీరంతో, బట్టతలతో బయటకు వెళ్తే… ఆయన అభిమానులు జీర్ణించుకోలేరనేది శోభన్ బాబు ఆలోచన. ఇక ఆ తరువాత తెలుగు సినిమా వజ్రోత్సవాలకు సినిమా పెద్దలు వచ్చి సాదరంగా ఆహ్వానించినా… శోభన్ బాబు సున్నితంగా తిరస్కరించారు. అలా అలా శోభన్ బాబు తనంతట తానుగానే సినిమాలకు దూరమయ్యారు.

ఇవి కూడా చదవండి

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts