telugu navyamedia
సినిమా వార్తలు

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఇంతకుముందు శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం, ఆ తరువాత ఊటీలో “డాక్టర్ బాబు” షూటింగ్ తదితర విషయాలను తెలుసుకున్నాము. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాము.

Sobhan-babu-with-Jayalalitha-1

ఊటీలో షూటింగ్ అనంతరం శోభన్ బాబు, జయలలిత మద్రాసు చేరుకున్నారు. మరునాడు ఉదయం శోభన్ బాబు ఫోన్ మోగింది. “శోభన్ బాబుతో మాట్లాడొచ్చా?” అంటూ అవతలి వైపు ఓ మధుర స్వరం ఇంగ్లీష్ లో అడిగింది. “ఎస్… మాట్లాడేది ఎవరో తెలుసుకోవచ్చా ?” ఎవరా అన్న అనుమానంతో అడిగారు శోభన్ బాబు. “జయలలిత” అంది ఆ మధుర స్వరం. “ఓ మీరా… ఎలా ఉన్నారు ? విమానంలో తేలిపోయి నన్ను మర్చిపోతారేమో అనుకున్నాను” అన్నారు శోభన్ బాబు. “మర్చిపోలేదులెండి… మీరెందుకు ట్రైన్ లో వచ్చారు ?” అడిగారు జయలలిత. “విమానం అంటే నాకు కొంచం భయం “అన్నారు శోభన్ బాబు నటిస్తూ. “మీరు జోక్ చేస్తున్నారు” అన్నారు జయలలిత. “అఫ్ కోర్స్” అన్నారు నవ్వుతో శోభన్ బాబు. “ఒక చిన్న రిక్వెస్ట్… రేపు మా ఇంటికి డిన్నర్ కు రావాలి. ఫ్యామిలీతో” అడిగారు జయలలిత. “ఫ్యామిలీతో రావడం కొంచం కష్టమనుకోండి. నేనొస్తాలెండి. నిజంగానే రమ్మంటున్నారుగా… తీరా ఆకలితో వచ్చాక జోక్ చేశానని అంటారా ?” అన్నారు శోభన్ బాబు. “లేదండీ. ఖచ్చితంగా రేపు సాయంత్రం 7.30 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను” అన్నారు.

Jayalalitha-and-sobhan-babu

మరునాడు సరిగ్గా సాయంత్రం ఏడున్నరకు మద్రాసులోని అత్యంత్య పాష్ లొకాలిటీ పోయెస్ గార్డెన్ లో ఉన్నఅధునాతనమైన అంతఃపురం పోర్టికోలో శోభన్ బాబు కారు ఆగింది. జయలలిత స్వయంగా కారు దగ్గరకు వచ్చి శోభన్ బాబుకు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ముందు వరండా చూస్తేనే మైసూర్ మహారాజా ప్యాలెస్ గుర్తొస్తుంది. ముప్పాతిక ఎకరం స్థలంలో ఉన్న ఆ భవన సౌందర్యం చూసి శోభన్ బాబు ముగ్ధుడయ్యారు. విశాలమైన ఆరు ఎయిర్ కండిషన్డ్ బెడ్ రూంలు… ఇంటిమధ్యలో ఓ పెద్ద లైబ్రరీ… అందులో బహుశా దొరకని పుస్తకం ఉండదేమో… ఆ లైబ్రరీని చూసి “ఈ పుస్తకాలన్నీ చదివారా ?” ఆశ్చర్యంగా అడిగారు శోభన్ బాబు. ” అందులో నేను చదవని కొన్ని మాత్రమే ఉన్నాయ్..” అన్నారు జయలలిత.

jayalalitha-house

అందుకే జయలలిత ఇంగ్లీష్ అంతబాగా మాట్లాడతారు. అంతేకాదు అద్భుతమైన భాషా సంపద, మేధా సంపత్తి ఆమె సొంతం. షేక్స్ పియర్, షిడ్నీషెల్టన్ లాంటి అనేక ప్రసిద్ధమైన పుస్తకాలు అందులో ఉన్నాయి. “అందరి పుస్తకాలు సరే… మీరేమీ రాయలేదా ..?” ఆ పుస్తకాలను చూస్తూ అడిగారు శోభన్ బాబు. “మదర్ అండ్ డాటర్” అనే 1500 పేజీల నవలలను అప్పటికే రాయడం మొదలుపెట్టినట్లు చెప్పారామె. ఆ పుస్తకంలోని రెండు మూడు పేజీలు చదివిన శోభన్ బాబు ఆ అద్భుతమైన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ ను చూసి ఆశ్చర్యపోయారు.

Jayalalitha

“ఇక భోజనం చేద్దామా ?” అడిగారు జయలలిత. “తప్పకుండా…” అన్నారు శోభన్ బాబు. ఇద్దరూ విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. శోభన్ బాబుకు ముద్దపప్పు, అందులో నెయ్యి వేసుకుని, ఆవకాయ నంజుకొని తినడం అంటే చాలా ఇష్టం. స్వీట్లలో జీడిపప్పు పాకం, పాయసం… పళ్లలో సీతాఫలం, బంగినపల్లి రసాలంటే పడిచస్తారు. ఇంకా మీగడ పెరుగు, చక్కర కేళి అరటిపండు కూడా చాలా ఇష్టం. శోభన్ బాబుతో అతి తక్కువ పరిచయం ఉన్న ఈ సమయంలోనే ఆయన ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకుని ఇవన్నీ చేసిపెట్టారు జయలలిత. ఇంకా నవకాయ పిండివంటలు కూడా చేశారు. తనపట్ల జయలలిత చూపిస్తున్న ఆదరానికి ముగ్ధుడైపోయారు శోభన్ బాబు. జయలలితే స్వయంగా వడ్డిస్తూ ఉండగా… ఆ విందును ఆరగించారు శోభన్ బాబు.

Muddapappu-avakai

మాటల మధ్యలో “మీరు పుట్టింది మైసూర్ లోనే కదా” అడిగారు శోభన్ బాబు. “అవును” సమాధానమిచ్చారామె. “మీకో విషయం తెలుసా… నేను మీ పరిచయ భాగ్యం కోసం విసిగివేసారి చివరకు మీరు పుట్టిన మైసూర్ వెళ్లాల్సివచ్చింది” అన్నారు శోభన్ బాబు. “అవునా… ఎందుకు?” ఆశ్చర్యపోయారు జయలలిత. వీరాభిమన్యు తరువాత నిర్మాత అడ్వాన్సు ఇవ్వడం మొదలుకొని, వారి తల్లిగారి షాక్ ట్రీట్మెంట్, తరువాత సత్యభామ సందర్శనం వరకు జరిగిన విషయాలన్నీ పావుగంటపాటు చెప్పారు శోభన్ బాబు. అరగంటపాటు పగలబడి నవ్వారు జయలలిత. “నేను విజయచిత్రకు, తమ్మారెడ్డి గారికి థాంక్స్ చెప్పాలి” అన్నారు జయలలిత. “అంటే నాకు చెప్పరా ?” అడిగారు శోభన్ బాబు. “మీకు థాంక్స్ చెప్పడానికే కదా ఈ విందు” అన్నారు జయలలిత. అలాఅలా వారిద్దరి మధ్య మాటలు సరదా నుంచి జీవితం, దాని విలువ, జాగ్రత్తలు లాంటి గంభీరమైన విషయాలవైపు మళ్ళింది.

Jayalalitha-and-sobhan-babu

ఇద్దరిదీ తినడం అయిపోయింది. కబుర్లాడుకుంటూనే లాన్ లోకి వచ్చి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు జయలలిత, శోభన్ బాబు. అక్కడి నుంచి చూస్తుంటే ఆకాశంలో చుక్కలు, చందమామ, చల్లని వెన్నెల వెలుగు అందంగా కన్పిస్తున్నాయి. అలా ఇద్దరూ సినిమాలు, ఆ తరువాత జీవితం తదితర విషయాల గురించి చాలానే మాట్లాడుకున్నారు. చాలాసేపు కబుర్లతో కాలక్షేపం చేసిన తరువాత “నే వెళ్ళొస్తా…” అని బయలుదేరారు శోభన్ బాబు. కార్లో ఇంటికి వస్తున్న శోభన్ బాబుకు జయలలిత మాటలే గుర్తొస్తున్నాయి. ” ప్రతి నటుడికీ లేదా నటికి నట జీవితం ఎక్కువకాలం ఉండదు. ఉన్న కొద్ది కాలాన్ని చక్కదిద్దుకోవాలి”.

Jayalalitha1

స్కూల్ ఫైనల్ లో మద్రాసు రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చిన గోల్డ్ మెడలిస్ట్, భరతనాట్యంలో దిట్ట, కర్ణాటక సంగీతంలో నేర్పరి, తొమ్మిది సంవత్సరాల్లోనే 100 సినిమాలు పూర్తి చేసి, కళైశెల్వి, కళాతనయిలాంటి బిరుదులతో పాటు ఎన్నో బహుమతులు పొందిన నటీమణి… కార్యదీక్షకు, కృషికీ పెట్టింది పేరు ఆమె… అరవ అయ్యంగార్ ఫ్యామిలీలో పుట్టినా.. కులమత వర్గ విభేదాలు అంటే ఏవగింపు.. జూదం, పొగతాగడం అంటే ఈసడింపు… జయలలిత గురించి ఇలా సాగుతున్నాయి శోభన్ బాబు ఆలోచనలు. దాదాపు శోభన్ బాబు ఆలోచనలు కూడా అలాగే ఉండడంతో ఆమెను మనసులోనే అభినందించారు ఆయన.

sobhan-babu-and-jayalalitha

ఇవి కూడా చదవండి

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts