telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జలదిగ్బంధంలో తిరుపతి

తిరుపతి జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునగడంతో, కాలనీవాసులు బయట అడుగు పెట్టేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది.

తిరుపతి నగరం స్మార్ట్ సిటీ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. ఇది వార్తల వరకే పరిమితం. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా వున్నాయి. అధికారుల రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి మధ్యలో వదిలేయడంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు.

ఓ పక్క గరుడ వారధి పనులు, మరోపక్క అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వర్క్ పనులు చేపట్టారు. అయితే, అధికారులు ఆరంభ శూరత్వంగా పనులు చేపట్టి, అనంతరం సైలెంట్ అయిపోయారు. ప్రధాన వీధులు, సందుల్లోని రోడ్లు పగలగొట్టి, మరమ్మతులు గాలికొదిలేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.అసలే అధ్వాన్న రోడ్లు, ఆ పై వర్షబీభత్సం, రోడ్లన్నీ జలమయం…ఈ దుస్థితిలో నగర ప్రజలు అడుగు బయట పెట్టడానికి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహన చోదకులు పాట్లు వర్ణనాతీతంగా ఉంది.

నగరంలోని అన్ని మార్గాల్లో నీరు నిలిచి వుంది. వెస్ట్ చర్చి వద్ద రోడ్డు చెరువును తలపించేలా తయారైంది. దీంతో, ఇక్కడ ట్రాఫిక్ నిలిపివేశారు. అదేవిధంగా ఎయిర్ బైపాస్ రోడ్డు, పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద భారీగా నీరు చేరడంతో, ఇక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళం రోడ్డు ,మధురానగర్ పరిసర ప్రాంతాలు సైతం జలదిగ్బంధలో చిక్కుకున్నాయి.

Related posts